Let's talk: editor@tmv.in
క్యాంపస్లో విజయోత్సవ ర్యాలీలు బంద్

క్యాంపస్లో విజయోత్సవ ర్యాలీలు బంద్

Pinjari Chand
18 సెప్టెంబర్, 2025

ఢిల్లీ యూనివర్సిటీలో ఈ రోజు జరిగే స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు తీయకూడదని, పూర్తిగా నిషేధించినట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ పాలనాధికారులకు, పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ ఎన్నికలు నిబంధనల ప్రకారం జరపకుంటే ఆఫీస్ బేరర్ల నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ ఎన్నికల్లో దాదాపు 2 లక్షలకు పైగా విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈవీఎంల ద్వారా ప్యానెల్ పోస్టులకు పోలింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా బ్యాలెట్ తోనే ఎన్నికలు జరుగుతాయి.

ఈరోజే ఎన్నికలు

గురువారం(ఈరోజు) విద్యార్థి ఎన్నికలు జరుగుతాయి. డే క్లాసెస్ వారికి ఉదయం, ఈవెనింగ్ క్లాసెస్ విద్యార్థులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ),ఎన్ఎస్ యూఐ(కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్), వామపక్షాలు మద్దతు ఇస్తున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూటమి మధ్య ఎన్నికలు జరగనున్నాయి. యూనివర్సిటీ అధ్యక్ష పదవికి జోస్లిన్ నందిత చౌదరి(ఎన్ఎస్ యూఐ), ఆర్యామాన్(ఏబీవీపీ), అంజలి (వామపక్షాల కూటమి) పోటీపడుతున్నారు. ఫలితాలు శుక్రవారం ప్రకటిస్తారు. గత ఎన్నికల్లో ఏడేళ్ల తరువాత ఎన్ఎస్ యూఐ తిరిగి పుంజుకుంది.

క్యాంపస్లో విజయోత్సవ ర్యాలీలు బంద్ - Tholi Paluku