Let's talk: editor@tmv.in
కమిన్స్ డౌట్.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ ఎవరు?

కమిన్స్ డౌట్.. సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ ఎవరు?

Shaik Mohammad Shaffee
17 మార్చి, 2026

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. గత టీ20 ప్రపంచకప్‌లో గాయపడిన కమిన్స్, ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ అతడు మైదానంలోకి ఎప్పుడు వస్తాడనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరిలో వచ్చిన అప్‌డేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. దీంతో కమిన్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది.

రేసులో యువ కెరటాలు

తాత్కాలిక సారథ్య బాధ్యతల కోసం ప్రస్తుతం ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జట్టు ఓపెనర్, స్థానిక ఆటగాడు అభిషేక్ శర్మ వైపు యాజమాన్యం మొదట మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. 2016లో అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన అనుభవం అభిషేక్ సొంతం. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లోనూ, గత ఐపీఎల్ సీజన్లలోనూ అతను అద్భుత ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. ఏళ్ల తరబడి జట్టుతోనే ఉన్న అభిషేక్ పట్ల అభిమానుల్లోనూ సానుకూలత ఉంది.

ముందుకు వచ్చిన ఇషాన్ కిషన్

అయితే, తాజా పరిణామాల ప్రకారం వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు రేసులో ముందుకు వచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు, జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఇషాన్ కిషన్‌కు కలిసొచ్చే అంశం. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇషాన్ సిద్ధహస్తుడని భావిస్తున్న యాజమాన్యం, అతనికే పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. అనుభవం కావాలా? లేక విధేయత కావాలా? అనే విషయంలో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలుగా విడిపోయారు. దీనిపై ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.