Let's talk: editor@tmv.in
కమిన్స్ ఆషెస్ ఓపెనర్‌కు దూరం

కమిన్స్ ఆషెస్ ఓపెనర్‌కు దూరం

Sandhula Dinesh
28 అక్టోబర్, 2025

ఆషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా నవంబర్ 21న పెర్త్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి టెస్టుకు దూరమయ్యాడు. వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపిస్తారు.

జులై నుంచి వెన్ను నొప్పి గాయంతో ఇబ్బంది పడుతున్న కమిన్స్, ఆషెస్ ఓపనర్‌కు సిద్ధంగా ఉండటం ‘సాధ్యం కాదు’ అని ఇంతకుముందే సూచించారు. సోమవారం హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ పూర్తి రికవరీకి సమయం సరిపోలేదని ధృవీకరించారు. ‘ఈ విషయం గతంలోనే చెప్పాం, ఎప్పుడూ టైట్‌గానే ఉండేది’ అని మెక్‌డొనాల్డ్ తెలిపారు. ‘డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే రెండో టెస్టుకు తిరిగి రావడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు సిద్ధంగా లేడు’ అని వివరించారు.

32 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ ఈ వారంలో బౌలింగ్ ప్రారంభించనున్నాడు. మెడికల్ టీమ్ రెండో టెస్టుకు ముందు ఆయన పురోగతిని పర్యవేక్షిస్తుంది. ఆట నుంచి తప్పినా కమిన్స్ పెర్త్‌కు జట్టుతో పాటు ప్రయాణిస్తాడు. ‘ప్యాటీ జట్టుతోనే ఉంటాడు, అప్పుడు ఎందుకు ఆడట్లేదని అందరూ ఆశ్చర్యపోతారు, అంత దగ్గర్లో ఉంటాడు’ అని కోచ్ చెప్పారు.

2021 నుంచి కమిన్స్ గైర్హాజరీలో ఆరుసార్లు ఆస్ట్రేలియాను నడిపిన స్మిత్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘స్టీవ్ లాంటి అనుభవజ్ఞుడు ఉండటం మాకు అదృష్టం. పాటీతో కలిసి అద్భుతంగా పనిచేస్తాడు, బాధ్యతల బదిలీ సజావుగా జరుగుతుంది’ అని మెక్‌డొనాల్డ్ ప్రశంసించారు.

కమిన్స్ స్థానంలో స్కాట్ బోలాండ్ మిచెల్ స్టార్క్, జాష్ హేజిల్‌వుడ్‌లతో కలిసి పేస్ దాడిని నడిపే అవకాశం ఉంది. ‘కెప్టెన్‌ను కోల్పోవడం ఎప్పుడూ మంచిది కాదు, కానీ బోలాండ్ లాంటి వాడు రావడంతో పరిస్థితి చెడ్డది కాదు’ అని కోచ్ ధీమా వ్యక్తం చేశారు.

కమిన్స్ ఆషెస్ ఓపెనర్‌కు దూరం - Tholi Paluku