Let's talk: editor@tmv.in
కమల దళానికి కొత్త సారథి.. జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

కమల దళానికి కొత్త సారథి.. జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

Shaik Mohammad Shaffee
17 జనవరి, 2026

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన 12వ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ శుక్రవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 20న (మంగళవారం) ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబిన్ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు

పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం పార్టీ అంతర్గత ఓటర్ల జాబితాను (ఎలక్టోరల్ రోల్స్) వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 5 నుంచి 6 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే జనవరి 20న నూతన అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు.

యువ నాయకత్వానికి పట్టాభిషేకం

ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీహార్‌కు చెందిన ఐదుసార్లు ఎమ్మెల్యే, మంత్రి అయిన నబిన్‌ను, యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తూ గతేడాది డిసెంబర్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధిష్ఠానం నియమించింది. 2020 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా హయాం ముగియడంతో, నబిన్ ఆ పీఠాన్ని అధిరోహించనున్నారు.

పార్టీ రాజ్యాంగం, పదవీ కాలం

బీజేపీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ఒక సభ్యుడు వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిలో ఉండవచ్చు (ప్రతి పర్యాయం మూడేళ్లు). అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి కనీసం 15 ఏళ్ల సభ్యత్వం కలిగి ఉండటంతో పాటు, గతంలో నాలుగు పర్యాయాలు యాక్టివ్ మెంబర్‌గా పనిచేసి ఉండాలి. కేవలం ఒకే నామినేషన్ దాఖలైతే ఓటింగ్ లేకుండానే అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.

అధ్యక్షుడి ఎన్నిక జాతీయ, రాష్ట్ర మండలి సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జరుగుతుంది. ఇందులో పార్టీ ఎంపీలు (10 శాతం), మాజీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అసెంబ్లీ, కౌన్సిల్‌లోని పార్టీ నేతలు సభ్యులుగా ఉంటారు. కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు కలిసి ఒక అభ్యర్థి పేరును సంయుక్తంగా ప్రతిపాదించాల్సి ఉంటుంది.

ప్రతిష్టాత్మకమైన మూడు సెట్ల నామినేషన్లు

అధ్యక్ష ఎన్నిక కోసం మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సిద్ధం కానున్నాయి. ఒక సెట్ మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సంతకాలు, మరో సెట్ మీద 20కి పైగా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సంతకాలు ఉంటాయి. ఈ ప్రక్రియ పార్టీలోని ఐక్యతను, నిర్ణయాధికార స్థాయిని ప్రతిబింబిస్తుంది.

హస్తినకు చేరనున్న కీలక నేతలు

ఈ ఎన్నికల ఘట్టం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ పదాధికారులు, సీనియర్ నేతలందరినీ ఢిల్లీకి రావాలని పార్టీ ఆదేశించింది. జాతీయ స్థాయిలో పార్టీ పటిష్టతను చాటేలా ఈ ఎన్నికల నిర్వహణ ఉండాలని అధిష్ఠానం భావిస్తోంది. ముఖ్యమంత్రుల సమక్షంలో కొత్త సారథికి బాధ్యతలు అప్పగించే కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.

ఎన్నికల సన్నాహాల్లో నబిన్ పాత్ర

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నితిన్ నబిన్ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడులో డీఎంకేకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడంలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా జనవరి 20న బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో పార్టీ రాజకీయంగా కొత్త దశలోకి అడుగుపెట్టనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎవరీ నితిన్ నవీన్?

బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న 45 ఏళ్ల నితిన్ నవీన్, బీహార్‌కు చెందిన సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, తన తండ్రి మరణానంతరం 2006లో 26 ఏళ్ల అతి పిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును చాటుకున్నారు. బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ, పట్టణాభివృద్ధి, న్యాయ శాఖ మంత్రిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

సంస్థాగత పరంగా నితిన్ నవీన్ అంచెలంచెలుగా ఎదిగారు. భారతీయ జనతా యువ మోర్చాలో కీలక పదవుల నుంచి పార్టీ జాతీయ స్థాయి వరకు తన ముద్ర వేశారు. ఛత్తీస్‌గఢ్, సిక్కిం వంటి రాష్ట్రాల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేసి పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న ఆయన, జనవరి 20న అధ్యక్షుడిగా ఎన్నికైతే, 52 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టిన నితిన్ గడ్కరీ రికార్డును అధిగమించి, బీజేపీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.