Let's talk: editor@tmv.in
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరల పెంపు

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరల పెంపు

Pinjari Chand
2 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2,078.50కు చేరింది. 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధర రూ.51 పెరిగి రూ.549కు చేరినట్లు సమాచారం. కోల్‌కత్తాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.218 పెరిగింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ ధరలు మార్చి 7న రూ.60 పెంచిన తర్వాత ప్రస్తుతం ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.913గా కొనసాగుతోంది.

అయితే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచినా, గృహ వినియోగదారులు, సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ వినియోగదారులు పెద్దగా ప్రభావితమవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు మార్కెట్‌కు అనుగుణంగా నిర్ణయిస్తారని , అవి సాధారణంగా ప్రతి నెలా సవరిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సిలిండర్లు ప్రధానంగా పరిశ్రమలు, హోటళ్లు వంటివి వినియోగిస్తాయని, దేశంలో మొత్తం ఎల్పీజీ వినియోగంలో వీటి వాటా 10 శాతం కన్నా తక్కువేనని వివరించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలు

ఏప్రిల్‌ 1 నుంచి వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ ధరలు భారీగా పెరగడమేనని తెలిపింది. మార్చిలో మెట్రిక్ టన్నుకు 542 డాలర్లుగా ఉన్న సౌదీ కాంట్రాక్ట్ ధర ఏప్రిల్‌కు 780 డాలర్లకు పెరిగిందని పేర్కొంది. అంతేకాకుండా ప్రపంచ ఎల్పీజీ సరఫరాలో 20 నుంచి 30 శాతం వరకు హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వివరించింది.

అయితే గృహ వినియోగదారులను రక్షించాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.913గానే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ ధర రూ.613గా యథాతథంగా ఉంచినట్లు పేర్కొంది. ప్రస్తుత ధరల పరిస్థితుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి సిలిండర్‌పై సుమారు రూ.380 వరకు నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపింది. మే చివరి నాటికి ఈ నష్టాలు సుమారు రూ.40,484 కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేసింది. గత ఏడాది మొత్తం రూ.60 వేల కోట్ల నష్టంలో రూ.30 వేల కోట్లను ఆయిల్ పీఎస్‌యూలు, మరో రూ.30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించిందని పేర్కొంది.

నష్టాన్ని భరిస్తున్న ఆయిల్‌ కంపెనీలు

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే భారత్‌లో గృహ ఎల్పీజీ ధరలు తక్కువగానే ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పాకిస్థాన్‌లో సిలిండర్ ధర సుమారు రూ.1,046గా ఉండగా, శ్రీలంకలో రూ.1,242, నేపాల్‌లో రూ.1,208గా ఉందని పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్ ధరల విషయానికి వస్తే ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77, డీజిల్ ధర రూ.87.67గానే కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు దాదాపు 100 శాతం వరకు పెరిగినా, దేశీయ వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.24.40, డీజిల్‌పై రూ.104.99 వరకు నష్టాన్ని భరిస్తున్నాయని పేర్కొంది. అయితే అధిక ఆక్టేన్ కలిగిన ప్రీమియం పెట్రోల్ రకాలైన ఎక్స్‌పీ95, పవర్‌‌95, స్పీడ్ ధరలను మాత్రమే లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు తెలిపింది. ఇవి మొత్తం పెట్రోల్ అమ్మకాలలో 2 నుంచి 5 శాతం మాత్రమే ఉండే ప్రత్యేక ఉత్పత్తులని, వాహనదారులు స్వచ్ఛందంగా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే ఇంధనమని వివరించింది.