Let's talk: editor@tmv.in
కమర్షియల్ గ్యాస్ సంక్షోభం: కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

కమర్షియల్ గ్యాస్ సంక్షోభం: కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

Gaddamidi Naveen
13 మార్చి, 2026

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఆయన గురువారం ఒక లేఖ రాశారు.

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత రాష్ట్రంలో పెద్ద సంక్షోభంగా మారిందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే ఆ నిర్ణయం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య ఆహార రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.

తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ ఇచ్చిన హెచ్చరికను ఆయన ప్రస్తావిస్తూ, హైదరాబాదు సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 90 శాతం హోటళ్లు, తినుబండారాల దుకాణాలు మరో 48 గంటల్లో మూతపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి చిన్న వ్యాపారులు, రోజువారీ కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా వాణిజ్య సంస్థలను విభిన్న కేటగిరీలుగా విభజించి ఎల్పీజీ కేటాయింపులు చేయాలని కేటీఆర్ సూచించారు. జాతీయ, అంతర్జాతీయ ఫుడ్ చైన్‌లు, మధ్యస్థాయి రెస్టారెంట్లు, చిన్న హోటళ్లు, వీధి వ్యాపారులు వంటి వర్గాలుగా విభజించి సరఫరా ప్రాధాన్యత నిర్ణయించాలని ఆయన కోరారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, వీధి ఆహార వ్యాపారులకు ముందుగా సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదే విధంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నగరాలు, జిల్లాల వారీగా సిలిండర్ సరఫరా తేదీలు, బుకింగ్స్ వివరాలు రోజువారీగా అందుబాటులో ఉంచాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సూచించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే సరఫరా తగ్గినా సిలిండర్ ధరలు పెరిగిన నేపథ్యంలో సంక్షోభ కాలంలో వాణిజ్య ఎల్పీజీ ధరలను స్థిరంగా ఉంచాలని కేటీఆర్ సూచించారు. ఈ సమయంలో ధరలు పెరగడం ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా అన్యాయమని ఆయన పేర్కొన్నారు.

బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల స్థాయిలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేసి అక్రమంగా గృహ ఎల్పీజీని వాణిజ్య వినియోగానికి మళ్లించడాన్ని అరికట్టాలని కోరారు. అదేవిధంగా ఐటీ, సేవా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని, హాస్టళ్లలో లేదా పీజీలలో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా గ్యాస్ కేటాయింపులు చేయాలని కూడా ఆయన సూచించారు.

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడంతో, కేంద్ర ప్రభుత్వం 'అవసర వస్తువుల చట్టాన్ని' ప్రయోగించి, గృహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ నిర్ణయాన్ని కేటీఆర్ సమర్థిస్తూనే, దీనివల్ల వాణిజ్య రంగం, ముఖ్యంగా ఆహార రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో ప్రస్తావించారు. దీంతో గృహ వినియోగానికి ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 25 శాతం పెంచి పూర్తిగా అదే దిశగా మళ్లించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక తెలంగాణలో గృహ ఎల్పీజీని అక్రమంగా వాణిజ్య రంగానికి మళ్లించే ఘటనలను అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ దాడులు నిర్వహిస్తోంది.