Let's talk: editor@tmv.in
కబడ్డీ లీగ్ తొలి టైటిల్ రోహ్‌తక్ రాయల్స్ కైవసం

కబడ్డీ లీగ్ తొలి టైటిల్ రోహ్‌తక్ రాయల్స్ కైవసం

Shaik Mohammad Shaffee
9 ఫిబ్రవరి, 2026

కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగించిన తొలి 'కబడ్డీ ఛాంపియన్స్‌ లీగ్' (కేసీఎల్) కిరీటాన్ని రోహ్‌తక్ రాయల్స్ కైవసం చేసుకుంది. శనివారం రాత్రి హర్యానాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ వేదికగా జరిగిన తుది పోరులో రోహ్‌తక్ 32–30 పాయింట్ల తేడాతో భివానీ బుల్స్‌పై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ట్రోఫీతో పాటు రూ.51 లక్షల నగదు బహుమతిని రోహ్‌తక్ సొంతం చేసుకుంది.

ఆరంభంలో రాయల్స్‌ పంజా

మ్యాచ్ ప్రారంభం నుంచే రోహ్‌తక్ రాయల్స్ దూకుడు ప్రదర్శించింది. విజయ్ మాలిక్, రాకేశ్ సింగ్రోహా, మిలన్ దహియాలు వరుస పాయింట్లతో విరుచుకుపడటంతో ఐదో నిమిషంలోనే భివానీని 'ఆలౌట్' చేసి 9–3తో భారీ ఆధిక్యాన్ని సాధించింది. ముఖ్యంగా భివానీ స్టార్ రైడర్ దేవాంక్‌ను రోహ్‌తక్ డిఫెండర్లు వరుసగా రెండుసార్లు అడ్డుకోవడం మ్యాచ్‌పై వారి పట్టును పెంచింది.

సౌరవ్‌ పోరాటం.. రాకేశ్‌ మెరుపులు

అయితే, భివానీ బుల్స్ కెప్టెన్ సౌరవ్ అద్భుత పోరాటంతో తన జట్టును రేసులోకి తెచ్చాడు. ఒకానొక దశలో రోహ్‌తక్‌ను ఆలౌట్ చేసే స్థాయికి భివానీ చేరుకోగా, రాకేశ్ సింగ్రోహా అదిరిపోయే 'సూపర్ రైడ్'తో జట్టును ఆదుకున్నాడు. దీంతో 13వ నిమిషంలో రోహ్‌తక్ 15-11తో నిలిచింది. కానీ విరామ సమయానికి ముందు రోహ్‌తక్ చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆలౌట్ అవ్వడంతో, స్కోరు 20-16 వద్ద తొలి సగం ముగిసింది.

హోరాహోరీగా రెండో అర్ధభాగం

రెండో అర్ధభాగంలో ఆట మరింత రసవత్తరంగా మారింది. భివానీ రైడర్లు వేగం పెంచడంతో 25వ నిమిషానికి స్కోరు 21–21తో సమమైంది. ఆ తర్వాత భివానీ 24-23తో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ, రోహ్‌తక్ డిఫెండర్లు సందీప్ దేశ్వాల్, మిలన్ దహియా, గౌరవ్‌లు కీలక సమయంలో దేవాంక్‌ను 'సూపర్ టాకిల్' చేశారు. ఈ రెండు పాయింట్లే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారాయి.

చాంపియన్‌ ఆటతీరు

చివరి నిమిషాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ, రోహ్‌తక్ రాయల్స్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. క్రమశిక్షణతో కూడిన డిఫెన్స్, సమయానుకూల రైడింగ్‌తో ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని 32–30తో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రాకేశ్ సింగ్రోహా 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మిలన్ దహియా (5), విజయ్ మాలిక్, సందీప్, ఆర్యన్ తలో 3 పాయింట్లు సాధించి సమష్టిగా రాణించారు.

గర్వంగా ఉంది: కోచ్‌, కెప్టెన్‌

కోచ్‌గా తన తొలి బాధ్యతలోనే టైటిల్ అందించిన సురేందర్ నాడా మాట్లాడుతూ.. ఆటగాళ్లు ఒత్తిడిలోనూ ప్రణాళికలను చక్కగా అమలు చేశారని కొనియాడారు. కెప్టెన్ సందీప్ నర్వాల్ స్పందిస్తూ.. తొలి కేసీఎల్ టైటిల్ గెలవడం గర్వంగా ఉందని, ఇది తమ విజయాల ప్రస్థానానికి ఆరంభం మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.