Let's talk: editor@tmv.in
కబ్జాల నుంచి విశాఖకు విముక్తి

కబ్జాల నుంచి విశాఖకు విముక్తి

FL - YUGDR
22 సెప్టెంబర్, 2025

రహదారి కబ్జాల నుంచి విశాఖ మహానగరం విముక్తం అవుతుంది. కూడళ్ళు, రహదారులు ఫుట్ పాత్‌లను కబ్జా చేసి రాజకీయ నేతల పైరవీలతో ఎంతకాలం నడిపిన బడ్డీలు, దుకాణాలు మూడు రోజుల్లో దాదాపుగా తొలగిపోయాయి. అందమైన సుందర నగరంగా విశాఖ ఎంతగానో ఖ్యాతి సంపాదించింది. అయితే గత కొన్నేళ్లుగా విశాఖలో అనధికార దందా అధికంగా సాగుతూ ఉంది. జీవనోపాది కోసం బడ్డి, షాపు ఏర్పాటు చేసుకుంటే తప్పులేదు. అది కూడా ఎవరికి ఇబ్బంది కలిగించని ప్రాంతంలో కాని అలా కాకుండా కొందరు దళారులు రంగప్రవేశం చేసి ఇష్టారాజ్యంగా డజన్ల కొలది ఎక్కడికక్కడ షాపులు, దుకాణాలు ఏర్పాటు చేసి తీవ్రంగా ట్రాఫిక్ సమస్యను తెచ్చిపెట్టారు. ఈ లెక్కన నగరంలోని ఎనిమిది జోన్ల పరిధిలో ఫుట్ పాత్‌లు కనుమరుగయ్యాయి. దీంతో పాదచారులు రహదారులపైనే నడవాల్సి వస్తుంది. దాని వల్ల రోడ్డు ప్రమాదాల శాతం పెరిగింది. అయితే ప్రధాన రహదారులను విస్తరించినప్పటికి వాటిని కూడా కొందరు దళారులు ఆక్రమించుకొని ఏదో ఒక బడ్డీ, దుకాణం ఏర్పాటు చేసేస్తున్నారు. దీంతో సువిశాలంగా ఉండాల్సిన రహదారులు ఇరుకు మయంగా మారుతున్నాయి. క్రమేపీ ఎక్కడికక్కడే ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది.

రహదారులు విస్తరించినా కబ్జాలతో ఇబ్బందులే

ఇటీవల కాలంలో సుమారు 32 మాస్టర్ ప్లాన్ రహదారులను విస్తరించారు. అంతకు మించి పెందుర్తి నుంచి సింహాచలం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సింహాచలం బిఆర్ఎస్ కారిడార్, మరో వైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ కంచరపాలెం మీదుగా గోపాలపట్నం, వేపగుంట వరకు పెందుర్తి బిఆర్ఎస్ కారిడార్ నిర్మించారు. అయితే ఎన్ని మాష్టర్ ప్లాన్ రహదారులు నిర్మించిన బిఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఎక్కడికక్కడ ఆక్రమణలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఇక రహదారుల పరిస్థితి అద్వాన్నంగా మారింది. మిక్స్డ్ ట్రాఫిక్ పేరిట బిఆర్ఎస్ కారిడార్ లలో కూడా గందరగోళం నెలకొంది. దీంతో ప్రమాదాల శాతం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆక్రమణలు ఎక్కువ కావడంతో తరచూ గందరగోళంగా మారడంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఒక ప్రణాళిక లేకుండా పోయింది. చిన్న రహదారి ఉంటే వెంటనే దానికి ఆనుకొని ఏదో ఒకషాపు, బడ్డీ ఏర్పాటు చేసేస్తున్నారు. ఇలా వందలు దాటి వేల ఆక్రమణలు పెరిగిపోయాయి. అటు మిదులాపురి వుడా కాలనీ నుంచి ఇటు సత్యం జంక్షన్ నుంచి సీతమ్మధార వరకు ఏ రహదారి చూసిన ఆక్రమణల మయం అయింది.

సాహసంతో కమిషనర్ కేతన్‌ గార్గ్‌ ముందడుగు

గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ ఎట్టకేలకు సాహసం చేశారు. ఏది ఏమైతే అదే జరగనీ అన్నట్లు ఒక అడుగు ముందుకు వేశారు. అంతకు మించి ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు, మరో వైపు కార్పొరేటర్లు అధ్యయన యాత్రకు వెల్లడంతో ఇదే మంచి అదునుగా భావించారు. దీంతో చాలా వరకు రాజకీయ ఒత్తిడి తగ్గింది. ఇక జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి సహకారంతో టౌన్ ప్లానింగ్ అధికారులకు సంపూర్ణంగా కమిషనర్ కేతన్ గార్గ్ కావాల్సినంత స్వేచ్చనిచ్చారు. తమ, పర బేదం లేకుండా మొత్తం ఎనిమిది జోన్ల పరిధిలో ఆక్రమణలను ఏకంగా ఊడ్చి పారేశారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆపరేషన్ లంగ్స్ 2.0లో ఏకంగా 1759 ఆక్రమణలు తొలగించారు. తొలిరోజు, రెండో రోజు ఎనిమిది టీమ్లతో ఆక్రమణలు తొలగించగా, శనివారం మూడో రోజు ఏకంగా 24 బృందాలు ఏర్పాటు చేసి ఒక్కరోజులోనే 706 ఆక్రమణలు తొలగించారు. అక్కడా ఇక్కడా బేదం లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు కనిపించిన ప్రతీ ఆక్రమణను పక్కకు తొలగించారు.

రహదారిగా మారిన ఫుడ్ కోర్ట్

విశాఖ నగరం నడిబొడ్డున సెంట్రల్ పార్క్ ఎదురుగా రహదారిపై వెలసిన ఫుడ్ కోర్ట్ రాత్రికి రాత్రి మాయమైపోయింది. ఫుడ్ కోర్ట్ స్థానంలో వాహనాలు రాకపోకలు సాగించే రహదారి ప్రత్యక్షమైంది. ఫుడ్ కోర్ట్ ప్రాంగణాన్ని సువిశాలంగా మార్పు చేశారు. అంతకు ముందే ఫుడ్ కోర్టును ఖాళీ చేయాలని కౌన్సిల్ ప్రత్యేకంగా తీర్మానం చేయడం ఇప్పుడు ఆపరేషన్ లంగ్స్ బాగా కలిసి వచ్చింది. అలాగే బీచ్ రోడ్డులో అనధికార ఆక్రమణలను తొలగింపులకు కమిషనర్ నిర్ణయం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. అన్ని చోట్ల దశల వారీగా తొలగింపులు చేపడుతుండడంతో నేడో రేపో బీచ్ రోడ్డు కూడా క్లీన్ అండ్ గ్రీన్‌గా మారనుంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూతో పాటు అనేక జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఇప్పుడు ఆర్.కె.బీచ్ వేధికకానుంది. కాబట్టి బీచ్‌లో ఆక్రమణలకు కూడా కమిషనర్ చెక్ పెట్టనున్నారు.

చెమటోడ్చిన పట్టణ ప్రణాళిక విభాగం

కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులందరూ చాలా రోజులకు రోడ్లుపైకి రంగంలోకి దిగారు. గతంలో ఏ బడ్డీని తొలగించాలన్నా ఎవరో ఒకరు ఫోన్ చేసి ఒత్తిడి తేవడంతో అధికారులు కూడా వెనుకడుగు వేసేవారు. కాని నేరుగా కమిషనర్ అండగా నిలవడం, చీఫ్ సిటీప్లానర్ ఏ.ప్రభాకర్ పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఎక్కడా ఉపేక్షించలేదు. ఇందుకు నగర ప్రజలు కూడా చాలా మంది తమ వంతు సంపూర్ణ సహకారం అందించారు. చిరువ్యాపారులకు అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం చూపించాలని రాజకీయ నాయకులు కోరుతున నాయకులు కోరుతున్నారు. అందుకు కమిషనర్ కూడా ఇప్పటికే వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి ఏ వార్డులో తొలగించిన వారికి అదే వార్డులో ప్రత్యామ్నాయం చూపిస్తామని చెబుతున్నారు. అయితే నగరాన్ని పరిశుభ్రంగా మార్పు చేయడంలో అటు చీఫ్ సిటీప్లానర్ ప్రభాకర్తో పాటు సిటీ ప్లానర్ మీనాకుమారి, డిప్యూటీ సిటీ ప్లానర్లు హరిదాస్, రామ్మోహన్, ధనుంజయరెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఆయా జోన్ల సహాయ సిటీ ప్లానర్లు రామకృష్ణ షబ్నంశాస్త్రి, మదుసూధనరావు, ఝాన్సీ, తిరుపతిరావు, గాజువాకలో వెంకటరావు, అనకాపల్లితో పాటు జోన్-8లో ఏసీపీ రామలింగేశ్వరరెడ్డి, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గోపన్న, ప్రమీల, శ్రీలక్ష్మి, బాలరాజు, ప్రవీణ్ ఇలా మొత్తం అధికారయంత్రాంగమంతా రోడ్లపైనే నిలిచి ప్రత్యేక బృందాలుతో భారీగా ఆక్రమణలు తొలగించారు. అయితే అన్నింటికంటే ఫుడ్ కోర్ట్ తొలగింపులో డిప్యూటీ సిటీ ప్లానర్లు హరిదాస్ చాకచక్యంగా వ్యవహరించారు. అక్కడ వ్యాపారులకు నచ్చచెప్పి త్వరలోనే ప్రత్యామ్నాయం చూపిస్తామని కూడా వారికి భరోసా కల్పించారు. కాని చాలా మంది వ్యాపారులు తమ నిరసన వ్యక్తం చేశారు. కొందరి కోసం అందరూ ఇబ్బంది పడుతున్నామని తమ గోడు వెల్లబోసుకున్నప్పటికి నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ తొలగింపులు చేపడుతున్నామని, కాబట్టి కౌన్సిల్ తీర్మాణం మేరకు ఫుడ్ కోర్ట్‌ను కూడా తొలగించక తప్పదని బాధితులకు హరిదాస్ విపులంగా వివరించారు.

ముందస్తు నోటీసులు

ఇంకా మిగిలిన వందలాది బడ్డీలు షాపులకు జీవీఎంసీ అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. స్వచ్ఛందంగా తొలగించుకోండి అంటూ వర్తమానం పంపించారు. అలా తొలగించుకోని పక్షంలో బలవంతంగా షాపులను తొలగించి తరలించాల్సి వస్తుందని హెచ్చరించారు.

కబ్జాల నుంచి విశాఖకు విముక్తి - Tholi Paluku