
కన్న తండ్రే కీచకుడు
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి అభం శుభం తెలియని ఐదేళ్ల పసిపాపపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అరుదైన ఈ సంఘటనలో పోక్సో కోర్ట్ న్యాయస్థానం తండ్రి చనిపోయేంత వరకు జైలు జీవితాన్ని అనుభవించాలని తీర్పునిచ్చింది. అంతే కాకుండా నిందితుడు రూ.15 వేలు జరిమానా చెల్లించాలని అందులో ఐదు వేల రూపాయలు బాలికకు ఇవ్వాలని, ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారం బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి సోమవారం సాయంత్రం వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ బత్తి రాజశేఖర్ అందించిన వివరాల మేరకు, నిందితుడు పి. అప్పన్న (30) విశాఖలోని ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, కుమారుడు. కుమార్తెకు 5 ఏళ్ల వయసు. గత ఏప్రిల్ 15న రాత్రి 11 గంటల ప్రాంతంలో అప్పన్న పూటుగా మద్యం సేవించి భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తగరపువలస మార్కెట్ యార్డు దగ్గర ఇద్దరు పిల్లల్ని దారుణంగా హింసించాడు. అంతటితో ఆగకుండా ఐదేళ్ల బాలికపై సొంత కూతురు అన్న మమకారం కూడా లేకుండా అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక తీవ్ర రక్తస్రావం మధ్య విలవిలలాడుతుండడంతో పక్కనే ఉన్న కర్ణాటక నుండి వచ్చిన ఇద్దరు లారీ డ్రైవర్లు, సమీపంలోని ఒక బంగారం షాపులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ గమనించి ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైట్ డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ రవి అక్కడకు చేరుకుని బాలికను వైద్యశాలలో చేర్పించారు. ఈ తరుణంలో నిందితుడు పరారయ్యాడు. నిందితునిపై పలు సెక్షన్లు కింద భీమిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏసీపీలు సిహెచ్ పెంటారావు, ఎస్ అప్పలరాజు దర్యాప్తు చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. మహిళా కానిస్టేబుల్ పైడితల్లి ప్రాసెక్యూషన్కు సహకరించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితునికి చనిపోయే వరకు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
