Let's talk: editor@tmv.in
కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను నిల్వ చేయాలి: టీఆర్‌ఈఏ

కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను నిల్వ చేయాలి: టీఆర్‌ఈఏ

Gaddamidi Naveen
11 జులై, 2026

ఎల్‌నీనో ప్రభావంతో తెలంగాణలో ఈ ఏడాది రుతుపవనాల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గాయని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ (టీఆర్‌ఈఏ) పేర్కొంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా గణాంకాల ప్రకారం జూలై ప్రారంభానికి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల నీటి నిల్వలు సాధారణ స్థాయితో పోలిస్తే 16 నుంచి 46 శాతం వరకు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది.

అయితే రాష్ట్రంలో నీటి కొరత నెలకొన్నప్పటికీ, నిరంతరం ప్రవహించే ప్రాణహిత–గోదావరి నదుల్లో వినియోగించదగిన వరద జలాలు అందుబాటులో ఉన్నాయని సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలతో అనుసంధానమైన లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అవసరమని సూచించింది.

మేడిగడ్డ జలాశయ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి (ఎండీడీడీఎల్) 93.500 మీటర్లు కాగా, ప్రస్తుతం గేట్లు తెరిచి ఉండటంతో వరద నీటి మట్టం సుమారు 97.500 మీటర్ల వద్ద ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొంది.

అలాగే నీటి ప్రవాహం సజావుగా కొనసాగేందుకు అన్నారం బ్యారేజీలో 116.500 మీటర్ల స్థాయిలో 5.1 టీఎంసీలు, సుందిల్ల బ్యారేజీలో 126.500 మీటర్ల స్థాయిలో 3.78 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని సూచించింది. గతంలో ప్రాణహితలో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైన దాఖలాలు ఉన్నందున, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా 8.8 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు లేదా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ఎల్‌నీనో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల్లో రైతులను, పంటలను రక్షించేందుకు కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్‌లోకి తీసుకురావాలని టీఆర్‌ఈఏ ప్రభుత్వాన్ని కోరింది. అవసరమైతే ఈ ప్రక్రియలో తమ సాంకేతిక సేవలను స్వచ్ఛందంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంఘం వెల్లడించింది.

ట్యాగ్‌లు
TelanganaGodavariWaterPranahitaKaleshwaramProjectKannepalliPumpsWaterManagementIrrigationFarmersFirstTelanganaFarmersAgriculture
కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను నిల్వ చేయాలి: టీఆర్‌ఈఏ - Tholi Paluku