
కన్నబిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు
ఆర్థిక దుస్థితికి తలొగ్గి త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన ఓ నిరుపేద దంపతులు తమ మూడు నెలల ఆడ శిశువును అమ్మేసిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆ బిడ్డను వెన్నక్కి తీసుకువచ్చారు.
కార్బుక్ సబ్-డివిజనల్ (ఎస్‌డీపీఓ) గమన్‌జోయ్ రియాంగ్ మాట్లాడుతూ కార్బుక్ సబ్‌డివిజన్‌లోని బ్రజేంద్రపుర ప్రాంతానికి చెందిన దంపతులు తమ చిన్నారిని అమ్ముకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ విషయాన్ని గ్రహించమని, కాగా ఆ వీడియో ఆధారంగా మొదట బిడ్డ తల్లిదండ్రులను సంప్రదించి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మధూమోగ్‌పరా ప్రాంతానికి చెందిన రంజిత్ చక్మా ఇంట్లో ఆ శిశువును పోలీసులు గుర్తించి సురక్షితంగా వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
శిశువును వెనక్కి తీసుకున్న అనంతరం పోలీసులు ఆ చిన్నారిని తిరిగి అప్పజెప్పుతూ చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాక దత్తత వంటి సరైన చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బిడ్డను మరొక కుటుంబానికి అప్పగించడం చట్టరీత్యా నేరమని వారికి వివరించారు.
ఇది ఇలా ఉండగా దంపతులకు ఇప్పటికే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిడ్డ తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తున్నప్పటికీ, నిరంతర పని లేకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించడం కష్టమై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. అందుకే శిశువు ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం బిడ్డను సురక్షితంగా తిరిగి వారికే అప్పగించి, వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు
