Let's talk: editor@tmv.in
కనీస మద్దతు ధర పెంపు - వివిధ అంశాలు

కనీస మద్దతు ధర పెంపు - వివిధ అంశాలు

Dr.Chokka Lingam
4 అక్టోబర్, 2025

ఇటీవల భారత ప్రభుత్వం 2026-27 మార్కెటింగ్ సీజన్ కోసం రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచింది. గోధుమ, శనగ, మినుములు, బార్లీ, రేప్‌సీడ్, ఆవాలు, సఫోలా వంటి ప్రధాన పంటలకు గత సంవత్సరం కంటే కచ్చితమైన పెంపు ఇవ్వబడింది. పంటల సాగులో ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, వాతావరణం ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కష్టాలు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం కష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం కలిగించేలా ఉంది. అయితే, ఈ ధరల పెంపు రైతులు, వినియోగదారులు ఇరువురి ఆర్థిక వ్యవస్థపై కలిగించే ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

రైతులకు లాభాలు

కనీస మద్ధతు ధరల పెంపు రైతులకు తక్షణ లాభాన్ని ఇస్తుంది. విత్తనాలు, ఎరువులు, ఇంధనం వంటి ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ పెంపు వారికి ఆర్థిక రక్షణగా పనిచేస్తుంది. ముఖ్యంగా అత్యధికంగా ఇబ్బందులు పడే చిన్న రైతులకు ఈ మద్ధతు ధర ఒక భరోసా అవుతుంది. శనగలు, పప్పులు, నూనెగింజల పంటల సాగు పెరగడం ద్వారా రైతులు గోధుమ, బార్లీ వంటి పంటలపై మాత్రమే ఆధారపడకుండా వైవిధ్యమైన పంటలు సాగుచేయవచ్చు. దీర్ఘకాలంలోఈ ధరల పెంపు రైతులకు ఆదాయం పొందటంలో సహకరిస్తుంది. అలాగే మెరుగైన విత్తనాలు, యంత్రాలు, సాగు పద్ధతులు, నీటి వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టే అవకాశం పెరుగుతుంది.

ఎదురయ్యే సవాళ్లు

ఈ మద్ధతు ధరల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో అయ్యే ఖర్చులు, వాతావరణం, కీటకాలు లేదా మట్టి సమస్యలలో తేడాలు వుండవచ్చు. ప్రస్తుతం కొనుగోలు వ్యవస్థలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి, ముఖ్యంగా గోధుమ, బియ్యం వంటి పంటలకు మాత్రమే కొనుగోలు మద్ధతు లబిస్తుంది . శనగలు, నూనెగింజలు లాంటి వాణిజ్య పంటలు ఎక్కువగా విస్మరించబడుతున్నాయి. చిన్న రైతులు పంట కొనుగోలు కేంద్రాల వరకు చేరడం కష్టతరం అవుతుంది. మద్ధతు ధర ప్రకటన చేసినా నిజమైన మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ ధరల్లో తేడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని పంటలకు ధర ఎక్కువగా ఉండటంవల్ల (మోనోకల్చర్) ఒకే పంట సాగు చేయడం జరుగుతుంది. దీని వల్ల నేల ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యం దెబ్బతింటాయి. ప్రభుత్వానికి కొనుగోలు భారంతో పాటు నిల్వ, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.

వినియోగదారులపై ప్రభావం

మద్ధతు ధర పెంపు వినియోగదారులకు కొంత వరకు ఉపశమనం ఇస్తుంది. ముఖ్యమైన ధాన్యాల సరఫరా నిల్వలో ఉంటే ధరల పెరుగుదలను తగ్గించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ధరలు పెరగడం వల్ల పేదవర్గాలపై భారమవుతుంది. పెద్ద స్థాయిలో కొనుగోలు జరగడం వల్ల నిల్వ సమస్యలు,పంట కోత అనంతరం నష్టాలు కూడా ఏర్పడతాయి. మద్ధతు ధరపై అధిక దృష్టి పెట్టడం వలన పండ్లు, కూరగాయలు వంటి ఇతర అవసరమైన ఆహార పంటల ఉత్పత్తి తగ్గవచ్చు. దీని వల్ల ఆహారపంటల వైవిధ్యం తగ్గి మిగిలిన ఆహార పదార్దాల ధరలు పెరుగుతాయి.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

రైతుల ఆదాయం పెరగడం గ్రామీణ ప్రాంత భూముల డిమాండ్‌ పెంచుతుంది. వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, గ్రామీణ సేవలలో వృద్ధి కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గి సామాజిక స్థిరత్వం పెరుగుతుంది. శనగలు, నూనెగింజల ఉత్పత్తి పెరగడం ద్వారా భారతదేశం ఆహార పదార్దాల ఉత్పత్తిలో స్వావలంబన సాధిస్తుంది, దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్య స్థిరత్వానికి దోహదం చేస్తుంది. అయితే, ప్రభుత్వ కొనుగోలు ఖర్చులు పెరగడం ఆర్దిక భారాన్ని పెంచుతుంది.కొనుగోలు మద్ధతు ధరపై అధికంగా ఆధారపడటం ప్రైవేట్ రంగం పెట్టుబడులు, మార్కెట్ సంస్కరణలను తగ్గిస్తుంది. పంట ధాన్యాల సేకరణ వ్యవస్థల్లో లోపాలు, అవినీతి, ప్రాంతీయ అసమానతలు కూడా సమస్యలుగా ఉంటాయి. ఈ పెంపు కారణంగా ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది, దీని వల్ల పెట్టుబడుల వృద్ధి, ద్రవ్య విధానం ప్రభావితమవుతాయి.

తీసుకోవలసిన చర్యలు

కనీస మద్ధతు ధర పెంపు ప్రభావవంతంగా ఉండాలంటే కొన్ని చర్యలు అవసరం.

అన్ని పంటలకు అన్ని రాష్ట్రాల్లో కొనుగోలు సేకరణ వ్యవస్థ వ్విస్తరించాలి.చిన్న రైతులకు దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొనుగోలు సాధ్యంకాని ప్రాంతాల్లో పంట అమ్మకం ధర ,కొనుగోలు మద్ధతు ధర మద్య తేడా ఉన్న రేటు రైతులకు చెల్లించాలి.

మద్ధతు ధర రైతుల నిజమైన పంట ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఉండాలి, వాతావరణం, కీటకాలు వంటి ప్రమాదాల కోసం అదనపు పంట ప్రమాద భీమా కల్పించాలి. కనీస మద్ధతు ధరను మార్కెట్ విధానాలతో అనుసంధానం చేయాలి. ప్రైవేట్ వ్యాపారం, కాంట్రాక్ట్ ఫార్మింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ద్వారా విలువ గొలుసు బలోపేతం చేయాలి. పంటల వైవిధ్యం ద్వారా వేసే పంటలు వాతావరణానికి తట్టుకునే విధంగా ఉండేవి వేయాలని రైతులను ప్రోత్సహించాలి. పంటలకు సబ్సిడీలు, పంటల భీమాల ద్వారా పంటల మార్పిడి ,వాణిజ్య పంటల పెంపకం, నీటిని ఆదా చేసే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. కొనుగోలు వ్యవస్థ లో పారదర్శకత పెంచాలి. డిజిటల్ రిపోర్టింగ్, ఆడిట్లు, బాధ్యతా విధానాలు ద్వారా అవినీతిని , వృథాని తగ్గించాలి.

వినియోగదారుల రక్షణ కోసం టార్గెటెడ్ ఫుడ్ సబ్సిడీలు, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు విడుదల చేయాలి.రైతులకు విస్తరణ సేవలు, రుణ సౌకర్యాలు, పంట బీమా బలోపేతం చేయాలి

కొనుగోలు మద్ధతు ధర పెంపుతో రైతులు ఆర్థిక భద్రత పొందుతారు, ఆహార భద్రత మెరుగుపడుతుంది, గ్రామీణ ఇబ్బందులు తగ్గుతాయి. కానీ ఈ విధానం విజయవంతం కావాలంటే కొనుగోలు సేకరణ ,గోడౌన్ లు లాంటి మౌలిక సదుపాయాలు, మార్కెట్ సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న పరిమితులు చిన్న స్థాయి కొనుగోలు కేంద్రాలు , చిన్న మార్కెట్లు, చిన్న రైతులు, ప్రాంతీయ అసమానతలు. వీటిని పరిష్కరించకపోతే కొనుగోలు మద్ధతు ధర పెంపు కేవలం రైతులకు ఒక అందని ద్రాక్ష గానే ఉంటుంది. మద్ధతు ధరని వ్యవసాయ సంస్కరణలో ఒక సాధనంగా చూడాలి. ఇది రైతులను శక్తివంతం చేయాలి, విలువ గొలుసులను బలోపేతం చేయాలి, పంటల వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం, రైతు, వినియోగదారులకు సమానమైన లాభాలు అందించాలి. ఈ కొనుగోలు మద్ధతు ధర పెంపు రైతులను రక్షించడమే కాకుండా, గ్రామీణ ఆదాయాలను పెంచి, భారతదేశం యొక్క ఆహార భద్రత మరియు స్వావలంబనకు మద్దతు ఇస్తుంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తే, వ్యవసాయ రంగం సమానత్వం, స్థిరత్వం, స్వావలంబన సాధించి పెరుగుతున్న జనాభాకు సమర్థవంతంగా సరిపోగలదు .