Let's talk: editor@tmv.in
కనీస మద్దతు ధరలు, సబ్సిడీలకు ఆవల వ్యవసాయరంగం

కనీస మద్దతు ధరలు, సబ్సిడీలకు ఆవల వ్యవసాయరంగం

Dr.Chokka Lingam
6 అక్టోబర్, 2025

భారత వ్యవసాయం ఒక కీలక మలుపు దశలో ఉంది. దశాబ్దాలుగా ఇది కనీస మద్దతు ధరలు , సబ్సిడీలు, ప్రభుత్వ కొనుగోళ్లతో ఆర్ధికంగా నిలదొక్కుకుంది. ఈ విధానాలు దేశానికి ఆహార భద్రతనిచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ మోడల్ పాతబడిపోయింది. ప్రజాభివృద్ధి, నిరుద్యోగం, ప్రపంచ మార్కెట్ ప్రభావం మొదలైనవి వ్యవసాయ విధానంలో మార్పులను తప్పనిసరి చేస్తున్నాయి. వ్యవసాయంలో ఉద్యోగాలు ఉన్నా అధనపు ఉత్పాదకత లేని ప్రచ్ఛన్న నిరుద్యోగం.‌

వ్యవసాయం ఇప్పటికీ దేశ జనాభాలో 43 శాతం మందికి ఉపాధి ఇస్తుంది. కానీ స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 15 శాతం మాత్రమే అందిస్తుంది. సగటు భూమి విస్తీర్ణం ఒక హెక్టారుకంటే తక్కువ. ఈ పరిస్థితుల్లో యాంత్రీకరణ, నీటిపారుదల, విభిన్న పంటలు సాగు ఇవన్నీ కష్టతరంగా మారాయి. గ్రామీణ యువతకు వ్యవసాయం ఒక ఆర్థిక అవసరంగా మిగిలిపోయింది, అంతేకానీ ఉపాధి అవకాశంగా కాదు. ఈ పరిస్థితి ప్రజల ఆర్థిక భద్రతను భారంగా మార్చుతోంది. నగరాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడంతో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం పెరుగుతోంది.

కొనుగోలు మద్దతు ధరల మాయాజాలం

కొనుగోలు మద్దతు ధర రైతులకు భద్రత ఇవ్వడం కోసం ఉద్దేశించబడింది. కానీ అది శాశ్వత ఆదాయ హామీ కాదు. దీని ప్రయోజనం పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో అది రాజకీయ నినాదం మాత్రమే.నీటి వినియోగం అధికమైన వరి, చెరుకు పంటల ప్రోత్సాహం వలన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద లక్షల కోట్లు విలువైన ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయాయి. ఇది ప్రభుత్వ ఖజానాపై భారమవుతోంది.

సబ్సిడీల రాజకీయాలు

ప్రభుత్వం ఇచ్చే ఎరువులు, విద్యుత్, నీటిపారుదల సబ్సిడీలు రైతులకు తాత్కాలిక ఉపశమనమే ఇస్తున్నాయి. అధిక మద్దతు ధర పలికినా వాణిజ్య పంటలు మట్టిలోని సారాన్ని దహించాయి. అధిక మోతాదులో నీటి వినియోగం జరిగి నీటి వనరులు అడుగంటాయి. రైతుని బ్యాంక్ రుణాలపై,అప్పులపై ఆధారపడి ఉండేలా చేశాయి. సబ్సిడీల బదులుగా ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతులు, మార్కెట్ సదుపాయాలు, శీతల గిడ్డంగులు, డిజిటల్ సేవల్లో పెట్టుబడి పెడితే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది.

ప్రపంచ మార్కెట్ల ప్రభావం

ప్రపంచ వ్యాపారంలో మన ఆహార ఉత్పత్తులు భాగమవడం వల్ల, రైతులు ఇప్పుడు అంతర్జాతీయ ధరల మార్పుల బారిన పడుతున్నారు. ఉన్నట్టుండి ఎగుమతులు నిషేధించడమో లేదా ఆహార పదార్థాల దిగుమతులు పెరగడమో జరుగుతున్నాయి. ఈ విధానాలు రైతు లాభాలను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత వ్యవసాయానికి అవకాశాలు ఉన్నాయి . ఇప్పటికే పండ్లు, పాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ రంగాల్లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. దీనిని నిలబెట్టు కోవడం కోసం స్థిరమైన విధానాలు, మౌలిక వసతులు అవసరం.

సాంకేతికతో నూతన వ్యవసాయ విప్లవం

ఇప్పుడు డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, స్మార్ట్ ఇరిగేషన్ - ఇవే కొత్త విప్లవానికి ఆయుధాలు. చిన్న , సన్నకారు రైతులు కలసి సంఘాలు గా ఏర్పడి ఉత్పత్తి సంస్థలు ఏర్పాటుచేసుకుని కొనుగోలు,అమ్మకాలు జరిపే మార్కెట్‌ను బలోపేతం చేసుకోవాలి .

ముందున్న అవకాశాలు

ప్రభుత్వం సబ్సిడీల బదులు ఉత్పాదకతకు అనుసంధానమైన ప్రత్యక్ష ఆదాయ మద్దతును కల్పించాలి. ఆహార పంటల వైవిధ్యం మొదలవ్వాలి. పప్పులు, నూనె గింజలు, ఉద్యాన పంటలపై అవగాహన పెంచాలి.వాటికి సరిపడా విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం రాయితీ తో అందించాలి. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి వ్యవసాయం దండగకాదు,పండుగ అని నిరూపించాలి. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలి.సరిపడా విద్యుత్ సరఫరా, నీటి వసతులు మెరుగు పరచాలి. ఆహార ధాన్యాల ఎగుమతి విధానాల్లో పారదర్శకత పాటించాలి.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి మండల కేంద్రంలో ఆహార ఉత్పత్తి నిల్వ గిడ్డంగులు అందుబాటులోకి తీసుకురావాలి .

గ్రామీణ విద్య, నైపుణ్యాభివృద్ధి

గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకునేలా వారికి వృత్తి విద్య నైపుణ్యాలు కల్పించాలి.ఆధునిక సాంకేతికతని గ్రామీణ యువతకి పరిచయం చెయ్యాలి.

ఇవన్నీ పాటిస్తే వ్యవసాయం ఆహార భద్రతనే కాదు , దేశ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడగలవు. సబ్సిడీలను మించి, రైతులకు మార్కెట్‌ జ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణలు అందించాలి. రైతు యజమాని కాకుండా వ్యాపారవేత్తగా ఎదిగితేనే వ్యవసాయం భారత సమృద్ధికి మూలస్తంభమవుతుంది.

కనీస మద్దతు ధరలు, సబ్సిడీలకు ఆవల వ్యవసాయరంగం - Tholi Paluku