
కన్నడ ఖ్యాతికి చిరునామా బైరప్ప
కన్నడ కవి భైరప్ప కన్నడ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా వ్యాపింపజేశారని, ఆయన రచనలు కన్నడ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయని, కన్నడ సాహిత్య సౌరభానికి ఆయనొక చిరునామాగా నిలిచారని సీఎం సిద్ధరామయ్య కొనియాడారు. ప్రఖ్యాత నవలా రచయిత, తత్వవేత్త అయిన భైరప్ప 94 సంవత్సరాల వయస్సులో బుధవారం రాత్రి బెంగుళూరులో చికిత్స పొందుతూ మరణించారు. సీఎం సిద్ధరామయ్య కవి భైరప్పకు నివాళి అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన లోతైన రచనలు కన్నడ నాట సాహిత్య వారసత్వాన్ని మిగిల్చాయని, ఆయన స్మారకార్థం మైసూర్ లో ఒక స్మారక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకోల్పుతామని సీఎం ప్రకటించారు. చిన్న గ్రామం నుంచి వచ్చి 25కి పైగా నవలలు రచించారని, 40 భాషల్లోకి అనువాదం జరిగాయని గుర్తు చేశారు. సాహిత్య రంగానికి ఎనలేని కృషి చేశారని, అనేక అవార్డులు ఆయనను వరించాయని తెలిపారు. నేను ఆయన రచనలన్నింటినీ చదవలేకపోయినప్పటికీ, కొన్నింటిని చదివే అదృష్టం కలిగిందన్నారు. ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లినా ఆయన రచనలు, సాహిత్య పరిమళాలు మనతోనే ఎప్పటికీ ఉంటాయన్నారు. ఆయన స్మారక కట్టడాన్ని నిర్మిస్తామని మరోసారి గుర్తు చేశారు.
జ్ఞానపీఠ్ అవార్డుకు అర్హుడు
బైరప్ప అనేక అద్భుతమైన రచనలు చేశారు. అందుకు ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు(1975), సరస్వతి సమ్మాన్ (2010), పద్మశ్రీ (2016), పద్మభూషణ్ (2023) అవార్డులు వచ్చాయి. అలాగే కర్ణాటక రాజ్యోత్సవం ఇలా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. ఆయన వీటన్నింటికీ అర్హుడు. సాహిత్యానికి ఆయన చేసిన విశేష సేవకు, అంకితభావానికి జ్ఞానపీఠ్ అవార్డు రావాల్సింది. కానీ ఆ అవార్డు రాలేదని విచారం వ్యక్తం చేశారు. అలాగే సాహిత్యం రాజకీయాలకు అతీతంగా ఉండాలని సీఎం అన్నారు.
భైరప్ప రచనలు
భైరప్ప రాసిన ప్రముఖ రచనలలో వంశవృక్ష, పర్వ, దాతు, మందార ఉన్నాయి, ఇవి నైతికత, తత్వశాస్త్రం, సామాజిక మార్పు ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. ఆయన రచనలు సమాజంపై చెరగని ముద్ర వేశాయి. దాతు నవలకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే మందార నవలకు సరస్వతి సమ్మాన్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి కన్నడ వాసిగా గుర్తింపు పొందారు.
ప్రధాని సంతాపం
భైరప్ప మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దేశ మనస్సాక్షిని కదిలించారని, భైరప్పను మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించారు. భారతదేశ ఆత్మలోకి లోతుగా వెళ్ళిన ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం కోల్పోయాం. ముఖ్యంగా కన్నడ భాషకు భైరప్ప చేసిన కృషి దేశ మేధో సాంస్కృతిక దృశ్యంపై చెరగని ముద్ర వేసిందని వ్యాఖ్యానించారు. చరిత్ర, తత్వశాస్త్రం సామాజిక సమస్యలపై ఆయన నిర్భయంగా రాశారని కొనియాడారు.
