
కన్నీటి కశ్మీరానికి కంటితుడుపు సాయమేనా?
కాశ్మీర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వానలు ప్రజలను కన్నీటి సంద్రంలో ముంచాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ లోయలో నివాసం ఉండే వారిని నిరాశ్రయులుగా మార్చాయి. నదులు ఉప్పొంగి ఆనకట్టలు కొట్టుకుపోయాయి. పర్వతాల పై నుంచి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో రహదారులు దెబ్బతిన్నాయి.వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అన్నదాతలు, వ్యాపారులు,వాహనదారులు,అందరూ నష్టపోయారు.వైష్ణోదేవి యాత్రను ఆపివేశారు. అలాగే రోడ్లు, వంతెనలు, ప్రజల నివాసాలు, పండ్ల తోటలు, జీవన సామాగ్రి, దుకాణదారులు సర్వం కోల్పోయారు.
ఆగష్టు 20 నుంచి సెప్టెంబర్ మొదటి వారం కురిసిన భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ వర్షాలకు దాదాపు 200 మందికి పైగా మరణించారు. పెద్దమొత్తంలో ప్రజా,ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. కానీ సహయం విషయంలో ఆయా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. కంటితుడుపు చర్యగా నిధులు విదిల్చి ప్రజల ఆత్మ విశ్వాసాన్ని మరింతగా కుంగదీస్తున్నాయి. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా నిధులు విడుదల చేసే నాయకులకు, కష్టాల్లో ఉన్న ప్రజలు కనబడకపోవడం, వారి ఆక్రందనలు వినబడకపోవడం రివాజుగా మారిందనే విమర్శలొస్తున్నాయి
నాయకుల పర్యటనలు
క్లౌడ్ బరస్ట్ తో అందమైన కాశ్మీరం మొత్తం అధోగతి పాలైతే కొంతమంది నాయకులు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 1న జమ్మూ నియోజకవర్గంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రకృతి వైపరీత్యం వలన నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. బిక్రమ్ చౌక్ లోని తావివంతెన, శివాలయం, తదితర వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.
ప్రభుత్వ అధికారుల సమావేశంలో ప్రధానితో చర్చించి వరద పర్యటన ప్రాంతాల్లో కమిటీ పరిశీలిస్తుందని దాని అంచనాల ప్రకారం నిధులను విడుదల చేస్తామన్నారు. అలాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ కశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న వరద ప్రభావిత గ్రామాలను సందర్శించి, పంటలు , ప్రజలకు కలిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తామని,సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని, బాధిత ప్రజలకు త్వరగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి నీరు తాగడానికి ఏర్పాట్లు చేస్తామని హామీలు గుప్పించారు.
రూ.209 కోట్ల సాయం
కాశ్మీర్ లో వరద ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) రూ.209 కోట్ల నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ నిధులు ఏ మూలకు సరిపోవని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్, తదితర పార్టీల నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల కిలో మీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని ప్రజాపనుల ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింగ్ వివరించారు. అటువంటింది రూ.209 కోట్లు ఏ పనులను పునరుద్ధరించడానికి సరిపోతాయని ప్రశ్నించారు. విద్యుత్ వ్యవస్థ కూడ దెబ్బతింది. వాటి పునరుద్దరణకు కూడా చాలా ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
రహాదారుల పరిస్థితి
జమ్మూలో రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నేషనల్ హైవేపై ఉన్న 105 వంతెనల్లో మూడు వంతెనలు పూర్తి గా దెబ్బతిన్నాయని,అవి జీలం నదిపై ఉన్నవంతెనలని ఈ రోడ్ల కనెక్టివిటీ దాదాపు ఎక్కువగా ఉందని ప్రిన్సిపాల్ సెక్రటరీ తెలిపారు. 2019 లో రావి నదిపై కతువాలో నిర్మించిన సెంత్-ఖారీ వంతెన కూడా దెబ్బతింది. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నేషనల్ హైవే మూసివేసి దాదాపు మూడు వారాలు అవుతున్న నేటికీ కూడా పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ జీవనోపాధికి ప్రధానంగా ఉన్న రోడ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఇందుకు సైన్యం సేవలను కూడా వినియోగించుకోవాలని కోరుతున్నారు. అలాగే హైవే పై నిలిచిన ట్రకుల్లో సుమారు 2000-3000 కోట్ల విలువైన ఆపిల్ పండ్లు ఉన్నాయి. అవి కాలతీతం వల్ల మురిగిపోతున్నాయి. ఆ వస్తువులే గాక రహదారులు దెబ్బతినడం వల్ల గొర్రెలు, మేకల సరఫరా లేక దాదాపు 300 పైగా వివాహలు వాయిదా వేసుకున్నారు.ప్రతి వ్యాపారానికి, మనుషుల మధ్యబంధాలను వేయడానికి ఇక్కడ రహదారులే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా వస్తురవాణా నిలిచిపోవడంతో వ్యాపారస్తులు, రైతులు, ఉత్పత్తి దారులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు.
అన్నదాతల కష్టాలు
జమ్మూ-కాశ్మీర్ లో ఆపిల్ పండ్ల , కుంకుమ పువ్వుల తోటలు తదితర విలువైన పంటలు పండుతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. కానీ వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కాశ్మీర్ ప్రజలు కోరుతున్నారు. వేగంగా జనజీవన పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
