Let's talk: editor@tmv.in
కదిరిలో అమ్మవారి ఆభరణాలు చోరీ: ఆలయ ఈవో సస్పెండ్

కదిరిలో అమ్మవారి ఆభరణాలు చోరీ: ఆలయ ఈవో సస్పెండ్

Panthagani Anusha
9 డిసెంబర్, 2025

దేవాలయాలకు రక్షకులుగా ఉండాల్సిన వారు… స్వయంగా దేవుడి సొమ్మును కాజేయాలని చూస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కదిరిలోని ఎర్రదొడ్డి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన మరోసారి రుజువు చేసింది.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గ్రామంలోని గంగమ్మ దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా (ఈవో)విధులు నిర్వహిస్తున్న మురళీ కృష్ణ అనే అదికారి అనధికారికంగా ఆలయానికి చెందిన విలువైన వస్తువులను తరలిస్తు పట్టుబడటంతో ప్రభుత్వం ఆయనను తక్షణమే సస్పెండ్ చేసింది.

ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలో అమ్మవారికి అలంకరించే వెండి ఆభరణాలు, దాదాపు 15 చీరలు మరికొన్ని ఆలయ వస్తువులను ఆటోలో ఎక్కించి తీసుకెళ్లడాన్ని గమనించిన గ్రామస్థులు అతన్ని అడ్డుకొని ప్రశ్నించగా అమ్మవారి వస్తువులను బ్యాంకు లాకర్ లో పెట్టేందుకు తీసుకువెళ్తున్నానని సమాదానం ఇచ్చాడు. ఆయన చెప్పిన విషయాన్ని నమ్మని గ్రామస్థులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కదిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని అడ్డుకుని సుమారు 5 కిలోల వెండి, 15 చీరలు మరికొన్ని ఆలయ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని జిల్లా దేవాదాయ శాఖ అధికారుల వద్ద జమ చేశారు.

ఈ ఘటనపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయాల పవిత్రతను భంగపరిచే, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా సహించమని, కఠినంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేసి, పోలీసు ఫిర్యాదు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు హిందూపురం డివిజన్ ఇన్‌స్పెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆలయ ఆస్తుల భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ డిప్యూటీ కమిషనర్‌కు తెలిపారు.

కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి మాట్లాడుతూ అమ్మవారి నగలను దొంగతనం చేసినందుకు గాను ఈవోపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 316 కింద కేసు నమోదు చేశాం. విచారణ కొనసాగుతోంది. నేడు రిమాండ్‌కు పంపనున్నాం” అని ఆయన తెలిపారు. ఈ ఘటనతో ఆలయ ప్రాంతంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ ఆస్తుల భద్రతను కట్టుదిట్టం చేయాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కదిరిలో అమ్మవారి ఆభరణాలు చోరీ: ఆలయ ఈవో సస్పెండ్ - Tholi Paluku