
కేంద్రం తీరుతోనే రైతులకు సమస్యలు
దేశంలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి తగ్గడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ తీరులో ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రామగుండం, నాగార్జున సాగర్ వంటి కీలక ఎరువుల కర్మాగారాలు పని చేయకపోవడం, అలాగే చైనా, రష్యా, యూరప్ దేశాల నుండి దిగుమతుల్లో జాప్యం వల్ల రైతులకు యూరియా సరఫరా తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు.
సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి
తెలంగాణకు అవసరమైన 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటి వరకు కేవలం 7 లక్షల టన్నులే వచ్చాయని, మిగతా భాగాన్ని త్వరగా పంపించాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి వివరించారు. కేంద్రం స్పందించి ఈ నెలలో 40,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామని హామీ ఇచ్చిందన్నారు. రాబోయే రబీ సీజన్కు అవసరమైన యూరియాను ముందుగానే రాష్ట్రానికి సరఫరా చేయాలని కూడా కోరినట్లు వెల్లడించారు. నానో యూరియా లిక్విడ్ రూపంలో అందుబాటులోకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నందున రైతులు దానిని ఉపయోగించేందుకు అలవాటు పడాలని మంత్రి సూచించారు. యంత్రీకరణ కోసం డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో ఎరువుల సరఫరాలో నెలకొన్న సంక్షోభం నిస్సందేహంగా సవాళ్లను తీసుకొస్తోంది. కేంద్రం ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే ప్రస్తుతం రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలకారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. కేంద్రాల ముందు పడిగాపులు కాస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానో యూరియా లాంటి పరిష్కారాలు భవిష్యత్తుకు మార్గం చూపుతాయన్న ఆశాజనకమైన అభిప్రాయం ఉన్నా, తక్షణ సమస్యలకు మాత్రం తగిన పరిష్కారం లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయకపోతే, రైతులపై ఆర్ధిక, మానసిక ఒత్తిడి పెరగడం ఖాయం. రైతు సంక్షేమం అనేది పాలకుల మాటల్లోనే కాదు, కార్యాచరణలో కనిపించాల్సిన అవసరం ఉంది. దీని కోసం కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.
