Let's talk: editor@tmv.in
కేంద్ర క్యాబినెట్ ఏపికి ఆశాజనకమే

కేంద్ర క్యాబినెట్ ఏపికి ఆశాజనకమే

FL - SUNL
25 సెప్టెంబర్, 2025

కేంద్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధికి ఒక కొత్త దిశానిర్దేశం చేసేందుకు దోహపడతాయని ఆర్ధిక నిఫుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.69,725 కోట్ల షిప్‌బిల్డింగ్, మారిటైమ్ ప్యాకేజీ, రూ.2,277 కోట్ల డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్ పరిశోధనా సామర్థ్య పెంపు పథకం, రూ.15,034.50 కోట్ల వైద్య విద్య విస్తరణ పథకం వంటివి ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాలకు విపరీతమైన ప్రయోజనాలు చేకూర్చనున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రారంభించిన కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలతో ఈ కేంద్ర పథకాలు కలగలిసి, రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని గణనీయంగా పెంచనున్నాయి. విషయంలోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలివే

కేంద్ర కేబినెట్ సమావేశంలో మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొద‌టి నిర్ణ‌యంగా రూ.69,725 కోట్ల షిప్‌బిల్డింగ్, మారిటైమ్ ప్యాకేజీ ప్ర‌క‌టించారు. భారతదేశాన్ని ప్రపంచ షిప్‌బిల్డింగ్ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ భారీ ప్యాకేజీని ప్రకటించారు. దీనిలో ఆర్థిక సహాయ పథకాలు, సాంకేతికత అభివృద్ధి, దేశీయ షిప్‌యార్డుల బలోపేతం, షిప్ ఫైనాన్సింగ్ వంటివి ఉన్నాయి. ఇది సముద్ర సంబంధిత రంగాలలో ఉపాధి, ఎగుమతులను పెంచుతుంది. రెండో నిర్ణ‌యంగా రూ.2,277 కోట్ల డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్ పరిశోధన సామర్థ్య పెంపు పథకాన్ని ప్ర‌క‌టించారు.

సైన్స్, టెక్నాలజీ, మెడికల్, మ్యాథమెటికల్ సైన్సెస్‌లలో పరిశోధన, అభివృద్ధికి మౌలిక సదుపాయాలను, మానవ వనరులను బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని ఆమోదించారు. ఇది దేశంలో శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. మూడ‌వ నిర్ణ‌యంగా రూ.15,034.50 కోట్ల వైద్య విద్య విస్తరణ పథకాన్ని ప్ర‌క‌టించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5,000 పీజీ సీట్లు, 5,000కి పైగా ఎంబీబీఎస్ సీట్లు పెంచడానికి ఈ పథకానికి ఆమోదం లభించింది. ఇది వైద్య విద్యను విస్తరించడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక కార్యక్రమాలు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ముందుగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక అభివృద్ధి పథకాలను ప్రారంభించింది. దుగరాజపట్నంలో జాతీయ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్ స్థాపించ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.29,253 కోట్ల వ్యయంతో విశాఖపట్నం పోర్ట్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భూమి, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్రం కల్పిస్తుంది. పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రణాళికను కూడా ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని ఉపయోగించుకొని, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి ప్రభుత్వం రూ.3,500 కోట్లను కేటాయించింది. దీని ద్వారా రాష్ట్ర తీరప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. షిప్‌బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దుగరాజపట్నంలో రూ.3,000 కోట్ల వ్యయంతో షిప్‌బ్రేకింగ్, రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు, కొత్త పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచడం, ఆధునిక సదుపాయాలు కల్పించడంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం వంటి పథకాలను అమలు చేస్తోంది.

కేంద్ర కేబినెట్ నిర్ణయాల‌తో ప్రయోజనాలివే

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు బలమైన మద్దతును అందిస్తాయి. ఈ రెండింటి కలయిక ద్వారా రాష్ట్రానికి ఎంతో ప్ర‌యోజ‌నం జ‌రుగ‌నుంది. షిప్‌బిల్డింగ్, మారిటైమ్ రంగంలో భాగంగా జాతీయ మెగా క్లస్టర్‌కు కేంద్రం మద్దతిస్తోంది. దీనికి కేంద్రం రూ.69,725 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం ద్వారా దుగరాజపట్నంలో రాష్ట్రం నిర్మిస్తున్న మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు భారీగా నిధులు, సాంకేతిక సహాయం లభిస్తుంది. దీనివల్ల ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తవుతుంది. షిప్‌బిల్డింగ్ ప్యాకేజీ ద్వారా నేరుగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఈ రంగం ఉపయోగించుకుంటుంది.

కేంద్రం నిధులు, ప్రోత్సాహకాలు విదేశీ సంస్థలను ఆకర్షిస్తాయి. తద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుంది. విద్యా సంస్థలకు ఆర్థిక సహాయంగా ప్ర‌క‌టించిన‌ రూ.2,277 కోట్ల డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్ పథకం రాష్ట్రంలోని విద్యా సంస్థలు తమ పరిశోధన మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ నిధులతో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగంలో పరిశోధన, విద్యకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది యువతలో నైపుణ్యాలను పెంచి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలను సృష్టిస్తుంది. వైద్యారోగ్య రంగానికి కేటాయించిన‌ రూ.15,034.50 కోట్ల కేంద్ర నిధుల‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల రాష్ట్రంలోని విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయి. మెడికల్ కాలేజీల ఆధునీకరణ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది.

కేంద్రం తీసుకున్న ఈ మూడు కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పథకాలతో కలిసి రాష్ట్రానికి ఒక సమగ్ర, దీర్ఘకాలిక ప్రగతికి దోహదపడనున్నాయి. షిప్‌ బిల్డింగ్, పరిశోధన, వైద్య విద్య వంటి కీలక రంగాల్లో కేంద్రం, రాష్ట్రం ఒకే దిశలో కలిసి పని చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్, భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఒక కీలకమైన చోద‌క‌ శక్తిగా మారనుంది. ఈ డబుల్ ఇంజిన్ సహకార విధానం ద్వారా రాష్ట్రంలో ఉపాధి, విద్య, ఆరోగ్యం, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి.

కేంద్ర క్యాబినెట్ ఏపికి ఆశాజనకమే - Tholi Paluku