
కేంద్రానికి ఒక్క రూపాయ కూడా నష్టం లేదు
దేశంలో జీఎస్టీ సవరణ వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయ కూడా నష్టం లేదని, ఆ భారాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్టీ అన్నారు. సోమవారం దుర్గాదేవీ మండపం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు తెచ్చిందని ప్రధాని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, ఈ సవరణల వల్ల కేంద్రానికి పైసా కూడా నష్టం లేదని, రాష్ట్ర ఖజానా పైనే భారం పడుతుందని వివరించారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆ నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ సంస్కరణలను స్వాగతించారు.
ప్రజలకు ఎంతో అవసరమైన జీవితబీమాపై జీఎస్టీని తొలగించాలని మొదట డిమాండ్ చేసింది నేనేనని, అందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాశానని ఆమె గుర్తుచేశారు. ప్రజలకు అవసరమయ్యే మందులపై, చిన్న, చిన్న వస్తువులపై కూడా గతంలో జీఎస్టీ వేసిన విషయాన్ని తెలిపారు. ఈ తగ్గింపులో కేంద్రానికి ఎటువంటి క్రెడిట్ లేదని, కానీ హడావుడి చేస్తుందని ఆరోపించారు. అయితే ఇప్పటివరకు ఉపాధి హామీ నిధులు, ఆవాస్ యోజన, జల్ స్వప్న్, రోడ్ల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వలేదని, ఇప్పుడు జీఎస్టీ ద్వారా కోల్పోయే రూ.20,000 కోట్ల నష్టాన్ని భరించాలని సూచించారు. అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూనే చాలా సైలెంట్ గా ఇతర మార్గాల నుంచి తిరిగి తీసుకుంటుందని ఆరోపించారు.
అంతకు ముందు టీఎంసీ నాయకుడు కునాల్ ఘెష్ కూడా జీఎస్టీ సంస్కరణలను విమర్శించారు. సీఎం మమతా బెనర్జీ వల్లే కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టిందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. జీఎస్టీ రేట్లను అత్యధికంగా వసూలు చేసి ఇప్పుడు తగ్గించామని ప్రచారం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు.
