
కత్తితో ఎంబసీలోకి జపాన్ జవాన్.. చైనా తీవ్ర నిరసన
జపాన్ రాజధాని టోక్యోలోని చైనా రాయబార కార్యాలయంలోకి ఒక జపాన్ సైనికుడు కత్తితో చొరబడటం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ ఘటనపై చైనా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జపాన్‌కు గట్టి నిరసన తెలిపింది. ఈ ఉదంతం ఇప్పటికే దెబ్బతిన్న ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింత పాతాళానికి పడవేసింది.
రాయబారిని చంపేస్తానంటూ బెదిరింపు
జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కి చెందిన 23 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ కోడాయ్ మురాటా మంగళవారం చైనా ఎంబసీలోకి అక్రమంగా ప్రవేశించాడు. తొలుత అతడిని ఎంబసీ సిబ్బంది అదుపులోకి తీసుకోగా, అనంతరం జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. "రాయబారికి నా అభిప్రాయాలు చెప్పాలని వెళ్లాను.. వారు తిరస్కరిస్తే ఆత్మహత్య చేసుకుని వారిని భయపెట్టాలనుకున్నాను" అని నిందితుడు విచారణలో తెలిపాడు. అయితే నిందితుడు చైనా దౌత్యవేత్తలను చంపేస్తానని బెదిరించాడని బీజింగ్ ఆరోపిస్తోంది. ఈ ఘటన వియన్నా కన్వెన్షన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మండిపడ్డారు.
పాఠ్యపుస్తకాల వివాదం
కేవలం చొరబాటు ఘటన మాత్రమే కాకుండా, జపాన్ విద్యాసంస్థల పాఠ్యపుస్తకాల్లో మార్పులపైనా చైనా నిరసన వ్యక్తం చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనా మహిళలను జపాన్ సైన్యం 'కంఫర్ట్ ఉమెన్'గా మార్చుకోవడంపై ఉన్న చారిత్రక వాస్తవాలను జపాన్ తొలగించిందని, అందులో ఎటువంటి బలవంతం లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని చైనా మండిపడింది. దీనితో పాటు వివాదాస్పద సెన్కాకు (డియావోయు) దీవులు తమవేనని చైనా పునరుద్ఘాటించింది.
ముదురుతున్న వైరం
జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ఇటీవల తైవాన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేశాయి. తైవాన్‌పై చైనా నావికా దళం దిగ్బంధనం విధిస్తే.. జపాన్ సైన్యం రంగంలోకి దిగుతుందని ఆమె హెచ్చరించారు. దీనికి ప్రతిచర్యగా చైనా ఇప్పటికే జపాన్‌పై వాణిజ్య ఆంక్షలు విధించడమే కాకుండా, తమ దేశ పర్యాటకులు జపాన్ వెళ్లవద్దని కోరింది. ఈ గొడవ వల్ల జపాన్ కూడా తన 2026 అధికారిక నివేదికలో చైనాకు ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించేసింది. తైవాన్ విషయంలో జపాన్ తన పద్ధతి మార్చుకోవాలని చైనా డిమాండ్ చేస్తోంది.
