Let's talk: editor@tmv.in
కూతురితో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

కూతురితో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

Panthagani Anusha
20 సెప్టెంబర్, 2025

కుటుంబ స‌మేతంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఈ మధ్యకాలంలో తరుచుగా జరుగుతోంది. అందులోనూ క‌ష్టాలు ఎదుర్కొనే ధైర్యం కోల్పోయి, బతుకు మీద ఆశ చ‌చ్చిపోయిన పెద్ద‌వాళ్లు త‌మ‌తో పాటు అభం శుభం తెలియని తమ పిల్లలను కూడా బలి చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెతో సహా మైసమ్మగూడలోని సిమెంట్ ఫీటర్స్ కాలేజీ స‌మీపంలో ఉన్న‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా మృతులిద్దరు బహదూర్ పల్లి వాసులుగా గుర్తించారు. అశోక్ (50), తన నాలుగేళ్ల కుమార్తె దివ్య, అతని భార్య సోనీతో కలిసి బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నాడు. అశోక్ వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అశోక్ భార్య అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని రోజుల క్రితం అశోక్ ఆత్మహత్యాయత్నం చేయగా చుట్టుపక్కల వారు గమనించి కాపాడారు. మళ్లీ ఇప్పుడు తన కుమార్తెతో కలిసి చెరువులో దూకి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు.

ఇలాంటి మరిన్ని సంఘటనలు తాజాగా కర్ణాటక రాష్ట్రం హోస్కోటే సమీపంలోని గోనకనహల్లిలో ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల కారణంగా దంపతులిద్దరు తమ ఇద్దరు చిన్నపిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు జలాశయంలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగాలి కానీ, ఇలా మనోధైర్యం కోల్పోయి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు.

కూతురితో సహా చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య - Tholi Paluku