
కొత్త పార్టీపై తుది నిర్ణయం తీసుకోలేదు : కవిత
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ ప్రయాణం. బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత కొత్త పార్టీ పెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలతో మంతనాలు ఆమె రాజకీయ భవిష్యత్తుపై మరింత చర్చను రేకెత్తించాయి. అయితే కవిత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణను స్పష్టంగా చూపిస్తున్నాయి.
సందిగ్ధంలో కవిత
కొత్త పార్టీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కవిత చెప్పడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పెడితే ఎదురయ్యే ఆర్థిక, రాజకీయ సవాళ్లను అంచనా వేస్తున్నారా? లేక బీఆర్‌ఎస్ నుంచి ఏదైనా సానుకూల సంకేతం కోసం ఎదురుచూస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తండ్రి కేసీఆర్ నుంచి దూరం అయినప్పటికీ మళ్లీ పార్టీలో చేరే అవకాశం ఉంటుందని ఆమె ఆశిస్తున్నారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పెట్టి పరాజయం పాలైతే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కవిత భయపడుతున్నారేమోనన్న వాదన కూడా ఉంది.కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్‌రావుపై తనకు వేరే కోపం లేదన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ, హరీశ్‌రావు, సంతోష్ సోషల్ మీడియాలు తనపైనే దాడి చేస్తున్నాయని, . తనపై దాడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామని వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా, ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరానని, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని కవిత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాం. ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని కవిత తెలిపారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని కవిత కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టులైన కాళేశ్వరం, ఆల్మట్టి వంటి అంశాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తి చూపుతున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తక్షణం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాము జాగృతి తరపున న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్లు, బతుకమ్మ చీరల పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె ఆరోపించారు. ఆంధ్రా నీటి హక్కుల కోసం పని చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణకు అడ్వైజర్ గా పెట్టుకుంటే తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, తక్షణమే ఆయనను తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. బనకచర్ల, ఆల్మట్టిల సమస్యలసై జాగృతి న్యాయపోరాటం చేస్తుందన్నారు.బతుకమ్మ పండుగకు మహళలకు చీరల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోకుంటే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామన్నారు కవిత. వారు కూడ స్పందించకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం అని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
కేసీఆర్ బాటలోనే
పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, ప్రస్తుతం తానూ అదే చేస్తున్నానన్నారు. దేశ రాజకీయాల్లో తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మెదటి కూతుర్ని తానే అని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను ఒక వర్గం కోసం కాకుండా ప్రజలందరి కోసం పని చేయాలనుకుంటున్నానని బీసీల సమస్య నా మనస్సుకు దగ్గరగా అనిపించిందన్నారు. అందుకే వారి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నానని కవిత చెప్పారు.
కొత్త రాజకీయ సమీకరణాలు
కవిత ప్రస్తావించినట్లుగా "రాజకీయాల్లో ఎవరూ స్థలం ఇవ్వరు తొక్కుకుంటూ వెళ్లాల్సిందే" అన్న వ్యాఖ్య ఆమెలోని పోరాట పటిమను సూచిస్తోంది. తనపై బీఆర్‌ఎస్ నేతల నుంచి వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తాను స్వేచ్ఛా పక్షిలా ఉన్నానని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, ఎవరు నన్ను సంప్రదించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ఆమె ద్వారాలు తెరిచే ఉన్నాయని చాలా మంది నాయకులు వచ్చి కలుస్తున్నారని చెప్పడం కొత్త రాజకీయ కూటములకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే కవిత ప్రస్తుతం ఒక నిశ్శబ్ద పోరాటం చేస్తోందని స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి పూర్తి స్థాయిలో విడిపోవడం సొంతగా పార్టీని స్థాపించడం, లేక తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఈ మూడు మార్గాల్లో ఆమె ఏది ఎంచుకుంటారు అనేది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనుంది.
