Let's talk: editor@tmv.in
కడియం రాజీనామా చేయాలి: తాటికొండ రాజయ్య

కడియం రాజీనామా చేయాలి: తాటికొండ రాజయ్య

Shaik Mohammad Shaffee
21 సెప్టెంబర్, 2025

ఎమ్మెల్యే కడియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు తాటికొండ రాజ‌య్య మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క‌డియం శ్రీహ‌రి అవినీతి తిమింగ‌లం అని రాజ‌య్య ఆరోపించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు అమ్ముకుంటే, కడియం మాత్రం ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నాడని అన్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తాటికొండ రాజ‌య్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడియం శ్రీహరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన విడుదల చేసింది చిత్తు కాగితమని, అది ప్రొసీడింగ్ కాపీ కాదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని ఆరోపించారు. కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి అని, ఎమ్మెల్యే సంతకం లేకుండా ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమని చెప్పి ఆ కాపీని తగులబెట్టారు.

ఈ సంద‌ర్భంగా కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య ఒక సవాల్ విసిరారు. ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలని, పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో.. దానికి కడియం సిద్ధంగా ఉండాలని రాజ‌య్య అన్నారు.

కడియం రాజీనామా చేయాలి: తాటికొండ రాజయ్య - Tholi Paluku