Let's talk: editor@tmv.in
కడప జిల్లా మైనర్ బాలిక హత్య కేసు…నిందితుడిపై పోలీసుల కాల్పులు

కడప జిల్లా మైనర్ బాలిక హత్య కేసు…నిందితుడిపై పోలీసుల కాల్పులు

Panthagani Anusha
12 ఏప్రిల్, 2026

కడప జిల్లా కాజీపేట ప్రాంతంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన 19 ఏళ్ల వెంకటేశ్వర్లును పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో స్వీయ రక్షణ కోసం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడి కాలికి బుల్లెట్ గాయం కాగా ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రేమ పేరుతో వేధింపులు.. నిరాకరించిందని ఘాతుకం

పోలీసుల కథనం ప్రకారం ఇంటర్మీడియట్ చదువుతున్న బాధితురాలిని నిందితుడు వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెస్తుండటంతో బాలిక ఆ విషయాన్ని స్పష్టంగా తిరస్కరించింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి నిందితుడు లోపలికి ప్రవేశించాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

అటవీ ప్రాంతంలో గాలింపు.. ఎదురుకాల్పులు

హత్య జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో మైదుకూరు-బద్వేలు రహదారికి సమీపంలోని రాణిబాగ్ అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రత్యేక బృందాలు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వెంకటేశ్వర్లు కత్తితో పోలీసులపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు హెచ్చరిస్తూ ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ నిందితుడి కాలికి తగిలింది.

గాయపడిన నిందితుడిని వెంటనే చికిత్స నిమిత్తం కడపలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మైదుకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 (హత్య)తో పాటు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినందుకు కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని నిందితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.