Let's talk: editor@tmv.in
కట్టబొమ్మన పాత్రలో మెప్పించిన మంత్రి కందుల దుర్గేష్

కట్టబొమ్మన పాత్రలో మెప్పించిన మంత్రి కందుల దుర్గేష్

Panthagani Anusha
8 మార్చి, 2026

స్వాతంత్ర సమరయోధుడు వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం శుక్రవారం సాయంత్రం విజయవాడ పటమటలోని ఆంత్రలాక్స్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహించిన “ఆటవిడుపు” క్రీడా–సాంస్కృతిక ఉత్సవాలు–2026 కార్యక్రమంలో ఈ ప్రదర్శన జరిగింది.

కట్టబొమ్మన ప్రత్యేక వేషధారణ, గంభీరమైన సంభాషణ శైలి, రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపించారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. కాగా ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వీరపాండ్య కట్టబొమ్మన దేశభక్తికి ప్రతీకగా నిలిచారని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్మరణీయమైనదని మంత్రి పేర్కొన్నారు. పాంచాలకురిచ్చి యుద్ధంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

కాగా కార్యక్రమంలో ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాటకు ప్రభుత్వ చీఫ్ జివి ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి దుర్గేష్ ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శన సభికులను ఆకట్టుకుని కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని నింపింది.

కట్టబొమ్మన పాత్రలో మెప్పించిన మంత్రి కందుల దుర్గేష్ - Tholi Paluku