Let's talk: editor@tmv.in
కోట్లు విలువ చేసే భూమికి ఐదు లక్షలు!

కోట్లు విలువ చేసే భూమికి ఐదు లక్షలు!

Panthagani Anusha
21 సెప్టెంబర్, 2025

రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో భూకబ్జాదారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. అమాయకుల, నిస్సహాయుల భూములే లక్ష్యంగా అక్రమార్కులు విస్తరిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను అతి తక్కువ ధరకు కాజేస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరహా మోసాలకు వికారాబాద్ జిల్లాలో జరిగిన తాజా ఘటన ఒక నిదర్శనంగా మారింది. అయితే ఈ ఘటనలో ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం ఐదు లక్షలకు సొంతం చేసుకున్నారు భూకబ్జాదారులు. ఈ మోసం వెనుక పోచమ్మ అనే మహిళ, ఆమె కుమారుడి పాత్ర బయటపడటంతో కేసు మరింత సంచలనంగా మారింది.

ఈ కేసులో బాధితురాలు పెద్దా ఉమ్మంతల్ గ్రామానికి చెందిన కురవ పద్మమ్మ. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లోని పోచమ్మ ఇంట్లో పని మనిషిగా పని చేస్తోంది. కాగా పద్మమ్మకు గ్రామంలో వారసత్వంగా రెండు ఎకరాల భూమి ఉంది. ఈ ఆస్తిపై సరైన అవగాహన లేని పద్మమ్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న యజమానురాలు పోచమ్మ, తన కుమారుడితో కలిసి ఆ భూమిని కేవలం రూ.5 లక్షలకే తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ వ్యవహారం పద్మమ్మ కుమారుడు సురేష్‌కు భూ సర్వే సమయంలో తెలియదు. ఆస్తి మోసపూరితంగా దోచుకుపోయారని గుర్తించిన సురేష్ వెళ్లి పోచమ్మను ప్రశ్నించగా, ఆమె కొందరు కిరాయి గూండాలతో సురేష్ ని బెదిరించింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

ఇక పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు మోసంలో ప్రమేయం ఉన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక దర్యాప్తులో భాగంగా మరో ఆశ్చర్యకరమైన విషయం బయట పడింది, పోచమ్మ కుమారుడు కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడని, ప్రభుత్వ వ్యవస్థలో ఉండటం వలన భూమి విలువ, రిజిస్ట్రేషన్ విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఇక గ్రామస్థులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేద ప్రజల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలు జరుగుతుండటం విచారకరమని, భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కఠిన నియమాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా భూ మాఫియాలను అరికట్టకపోతే ఇలాంటి కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతేకాక నేరస్థులిద్దరు కలిసి ఇంకా ఎన్ని భూములు ఇలా మోసపూరిత పద్ధతిలో కబ్జా చేశారనే కోణంలో విచారిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

కోట్లు విలువ చేసే భూమికి ఐదు లక్షలు! - Tholi Paluku