
కటక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది రోగులు మృతి
ఒడిశాలోని కటక్ నగరంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడ్డారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూ, సమీప వార్డుల్లో మొత్తం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వివరాల ప్రకారం మంటల్లో ఏడుగురు రోగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురిని తరలించే సమయంలో కాలిన గాయాలతో, అలాగే ఊపిరి ఆడక మరణించారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై న్యాయపరమైన విచారణ (జుడీషియల్ ప్రోబ్) కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఫైర్ సర్వీసు డీజీని వ్యక్తిగతంగా ఆసుపత్రిని సందర్శించి అగ్ని భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించాలని ఆదేశించారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానం
ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తెల్లవారుజామున 2.30 నుంచి 3 గంటల మధ్య ట్రామా కేర్ ఐసీయూలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, రోగుల బంధువుల సహాయంతో ఐసీయూలో ఉన్న రోగులను ఇతర విభాగాలకు తరలించారు.
ప్రధానమంత్రి సంతాపం
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ చర్యలు
మంటలు చెలరేగిన వెంటనే 11 మంది వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి రోగులను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు కాలిన గాయాలకు గురయ్యారు. ప్రస్తుతం వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
ఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల ప్రకారం, ప్రమాదానికి ముందు రెండు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. తర్వాత ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగతో మొత్తం విభాగం నిండిపోయిందని చెప్పారు. కొంతమంది స్థానికులు, రోగుల బంధువులు కిటికీ గాజు పగులగొట్టి నీరు పోసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి ఆసుపత్రి నర్సు మార్గదర్శకంతో కొన్ని విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి ఏడు మంది రోగులను బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
గవర్నర్, ప్రతిపక్ష నేతల స్పందన
ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభావిత రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరలో ఆసుపత్రిని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
