Let's talk: editor@tmv.in
కంటోన్మెంట్ అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత

కంటోన్మెంట్ అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత

Gaddamidi Naveen
13 సెప్టెంబర్, 2025

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో భారీ పోలీస్ బందోబస్త్ మధ్య అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రక్షణశాఖకు చెందిన భూములపై గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న టిఫిన్ సెంటర్లు, దుకాణాలు, షెడ్లు వంటి నిర్మాణాలను అధికారులు జెసిబిలతో కూల్చివేశారు.ఈ భూములపై వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారు, ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను పక్కనపెట్టి తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చినట్లు సమాచారం.

రక్షణ శాఖకు చెందిన భూములపై ఈ తరహా అక్రమ నిర్మాణాలు చట్ట విరుద్ధమైనవని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ, వ్యాపారులు స్ధలాన్ని ఖాళీ చేయకపోవడంతో చివరికి అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.. ఈ కూల్చివేత చర్యల నేపథ్యంలో స్థానికులు, వ్యాపారులు ఈ చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధికారులకు వ్యాపారులు తోపులాటకు దిగినట్టు కూడా సమాచారం. అయితే, ముందస్తుగా తీసుకున్న భారీ బందోబస్తు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.అదేవిధంగా, కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రేకుల షెడ్డులపై కూడా అధికారులు చర్యలు చేపట్టారు.

టిఫిన్ సెంటర్లు, చిన్న స్టాల్స్‌తో పాటు రోడ్డుపై ఏర్పడిన తాత్కాలిక నిర్మాణాలన్నీ జెసిబిల సాయంతో తొలగించారు. ఈ చర్యల ద్వారా రక్షణ భూముల ఆక్రమణకు చెక్ పెట్టాలన్నదే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

స్థానిక వ్యాపారులు మాత్రం అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఏళ్ల తరబడి ఇక్కడే జీవనం సాగిస్తున్నాం. ఒక్కసారిగా ఇంటికైనా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయమని" వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యాపారులు తమ పొట్ట నట్టేలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఘటన మరోసారి రక్షణశాఖ భూములపై అక్రమ కట్టడాల సమస్యను వెలుగులోకి తీసుకువచ్చింది. అధికారుల ప్రకారం, ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియలో భాగం. ఈ చర్యలు ఇప్పటితో ఆగవు, ఇంకా మిగిలిన ఆక్రమణలపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

కంటోన్మెంట్ అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత - Tholi Paluku