
ఔషధం కాదు, పిల్లల గొంతు నులిమే విషం
రాత్రి చీకటిలో దగ్గు చప్పుళ్లు...! బిడ్డ ఊపిరిలో భారమైన శబ్దం...! తల్లి ఆత్రుతగా కౌగిలించుకుంది.. నాన్న గందరగోళంగా మెడికల్ షాప్‌కి పరుగుపెట్టాడు. ఒక దగ్గు సిరప్ తీసుకున్నాడు.. ఆ సిరప్ తన బిడ్డను దగ్గు నుంచి విముక్తి చేస్తుందన్న ఆశ ఆ తండ్రిది. కానీ.. ఉదయం సూర్యకిరణాలు దూసుకొచ్చేలోపే, చిన్నారి గొంతు మూగబోయింది. ఆడుకోవాల్సిన చేతులు చల్లబడ్డాయి. నవ్వుకోవాల్సిన పెదాలు గడ్డకట్టాయి. జీవితం ఒక్క రాత్రిలో ఆగిపోయింది. ఇలా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 12మంది చనిపోయారు. ఇదంతా చూసిన వైద్యులు ఆందోళనపడ్డారు. తల్లిదండ్రులు విలపిస్తూ ప్రశ్నించారు.. మా పిల్లలను చంపింది ఎవరు? సిరప్ లోపల ఏముంది? మరణానికి దారి తీసింది ఏంటి? ఇలా ప్రశ్నలు గాల్లో తేలుతున్నాయి. సమాధానాలు మాత్రం ఎక్కడా లేవు.
మధ్యప్రదేశ్-చింద్వారా జిల్లాలో ఇటివల ఒక పెద్ద కలకలం చెలరేగింది. 15 రోజుల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు ఒక్కొక్కరుగా కిడ్నీ సమస్యలతో మరణించారు. ఈ పిల్లలు సాధారణ దగ్గు కారణంగా కాఫ్ సిరప్ తాగారు. కానీ ఆ తర్వాత వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వాంతులు, ఊపిరి సమస్యలు వచ్చి చివరికి మూత్రపిండాలు పని చేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇదే తరహా మరణాలు పొరుగున ఉన్న రాజస్థాన్‌లోనూ నమోదయ్యాయి. సికర్, భారత్‌పూర్ జిల్లాల్లో చిన్నారులు సిరప్ తాగిన తర్వాత కుప్పకూలడం ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది. ఈ అనుమానాలతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాలను పంపింది. నేషనల్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ అధికారులు బాధిత ప్రాంతాలకు వెళ్లి దగ్గు సిరప్, నీరు, ఆహారం, రక్త నమూనాలను సేకరించారు. ల్యాబ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. అయితే అందులో పెద్దగా విషపదార్థాలు లేవని చెబుతున్నాయి. అయినా చిన్నారుల మరణాల అసలు కారణం ఇంకా స్పష్టంగా బయటపడలేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీల దగ్గు సిరప్స్‌ను తక్షణమే మార్కెట్ నుంచి వెనక్కి పిలిపించాయి. కొన్ని బ్యాచ్‌లను పూర్తిగా నిషేధించాయి. ఫార్మసీలలో సిరప్ కొనుగోలు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రుల కళ్ళల్లో మాత్రం ఇంకా ఆందోళన కనిపిస్తోంది. ఒక బాటిల్ మందు ప్రాణాన్ని కాపాడుతుందా, లేక ప్రాణం తీసేస్తుందా అన్న అనుమానం ప్రతి కుటుంబాన్ని కలవరపెడుతోంది. నిజానికి దగ్గు అనేది చాలా సాధారణ సమస్య. చిన్నపిల్లలు దగ్గుతుంటే తల్లిదండ్రులు తక్షణం మందు కోసం పరుగులు తీస్తారు. చాలా మందికి దగ్గు సిరప్ ఒక సాధారణ పరిష్కారంలా కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ బాటిల్ లోపల ఏముంటుంది? సాధారణంగా దగ్గు సిరప్స్‌లో యాంటీహిస్టమైన్ మందులు, కొన్ని సందర్భాల్లో కోడైన్ లాంటి బలమైన పదార్థాలు ఉంటాయి. మెథార్ఫాన్ లాంటి రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో దగ్గు ప్రతిస్పందనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
పెద్దవాళ్లకు ఈ ఔషధాలు ఒక పరిమితి వరకు సహాయపడతాయి. కానీ చిన్నారుల శరీరం మాత్రం చాలా సున్నితమైనది. రెండు సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ మందులు తీవ్రమైన చెడు ప్రభావాన్నికలిగించవచ్చు. ఊపిరి ఆడకపోవడం, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం లాంటి సమస్యలు రావచ్చు. అందుకే రెండు సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది. అయితే కేవలం వయస్సు కారణం మాత్రమే కాదు. కొన్నిసార్లు దగ్గు సిరప్ తయారీ సమయంలో జరిగే పొరపాట్లూ ప్రాణాంతకంగా మారుతాయి. కొన్ని కంపెనీలు తగిన నియంత్రణ లేకుండా విషపూరిత రసాయనాలు కలిసేలా తయారు చేసిన సందర్భాలు గతంలో చూశాం. ముఖ్యంగా డయిథిలీన్ గ్లైకాల్స్, ఎథిలీన్ గ్లైకాల్స్ లాంటి పారిశ్రామిక రసాయనాలు అనుకోకుండా సిరప్స్‌లో కలిస్తే అవి కిడ్నీలను నాశనం చేస్తాయి. చిన్నారుల శరీరం ఆ విషాన్ని తట్టుకోలేక వెంటనే కుప్పకూలిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మందులు అమ్ముతున్న కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించడం లేదా? ప్రభుత్వం తనిఖీల్లో బలహీనత చూపుతోందా? లేక వైద్యులు సిరప్స్ అవసరం లేకపోయినా ఎక్కువగా సూచిస్తున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో తన్నుకొస్తున్నాయి.
వాస్తవానికి ఇండియాలో దగ్గు సిరప్ చుట్టూ కలకలం ఇవాళ రేగుతున్నా, ఇదే కథ గతంలో ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ కనిపించింది. 2022లో ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశం గాంబియా భయంకరమైన వార్తను చూసింది. అక్కడ 66 చిన్నారులు ఒక్కసారిగా మరణించారు. దీనికి కారణం.. ఇండియా నుంచి ఎగుమతి అయిన దగ్గు సిరప్స్. ఆ సిరప్స్ లోపల ఉండాల్సింది ఔషధం, కానీ పరీక్షల్లో ప్రాణాంతకమైన రసాయనం ఉందని బయటపడింది. డయిథిలీన్ గ్లైకాల్. ఇది నిజానికి యాంటీఫ్రీజ్ ద్రవం, పారిశ్రామిక ఉపయోగాల్లో వాడేది. కానీ ఒక తప్పిదం వల్ల అది మందులో కలసింది. ఫలితం ఏమైంది? చిన్నారుల కిడ్నీలు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. తల్లిదండ్రుల కళ్ళ ముందే పిల్లలు మరణించారు. ఆ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గట్టిగా హెచ్చరించింది. అదే ఏడాది చివరిలో ఉజ్బెకిస్తాన్‌లోనూ ఇలాంటి దురదృష్టమే చవిచూసింది. అక్కడ 15మందికి పైగా పిల్లలు చనిపోయారు. కారణం మళ్ళీ దగ్గు సిరప్. ఈసారి అది 'డాక్-1 మ్యాక్స్' అనే సిరప్. తయారీ స్థలం ఇండియానే. నోయిడాలోని ఒక కంపెనీ దీని తయారు చేసింది. అక్కడ కూడా అదే సమస్య.. విషపూరిత రసాయనాలు కలవడం. ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం వెంటనే ఆ మందును నిషేధించింది. కంపెనీ లైసెన్స్ రద్దయింది.
ఈ రెండు ఘటనలు ఇండియా పేరును అంతర్జాతీయంగా దెబ్బతీశాయి. 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'అని గర్వంగా చెప్పుకునే ఇండియా,, ప్రాణాంతక సిరప్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది. గాంబియా, ఉజ్బెకిస్తాన్ మాత్రమే కాదు, మరో కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా భారతీయ సిరప్స్‌పై అనుమానంతో నిషేధాలు అమలు చేశాయి. ఇదంతా పేద దేశాల్లో జరిగిన ఘటన కావడంతో ఇండియాలో దీనిపై ఆశించిన స్థాయిలో చర్చ జరగలేదు. ఇప్పుడు భారత్‌లోని పిల్లలు చనిపోవడంతో ఇది ప్రధాన హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే. ఎందుకు పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి?
నిజానికి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కఠినమైన నియంత్రణలు పాటిస్తాయి. కానీ చిన్న చిన్న సంస్థలు కొన్నిసార్లు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే తయారీ సమయంలో కలిసిన ఒక చిన్న విషపదార్థం పిల్లల ప్రాణాలను తినేస్తుంది. ఇంకో సమస్య నిబంధనల అమలు. భారత్‌లో ఒక స్కామ్ బయటపడ్డాక, మీడియాలో పెద్ద వార్త అవుతుంది. ప్రభుత్వాలు విచారణలు చేస్తాయి. కొన్ని కంపెనీల లైసెన్స్ రద్దవుతుంది. కానీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే గాడిలో వ్యవస్థ నడుస్తుంది. తప్పు చేసినవారికి కఠినమైన శిక్ష ఉండకపోవడంతో నిర్లక్ష్యం మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ఇక మరొక కోణం కూడా చూడాలి. డాక్టర్లు దగ్గు సిరప్ నిజంగా అవసరమా లేదా అనేది కూడా ఆలోచించాలి. చాలా సార్లు చిన్నారుల దగ్గు తేలికపాటి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. విశ్రాంతి, నీరు, ఇంటి జాగ్రత్తలు సరిపోతాయి. కానీ ఫార్మసీల్లో సులభంగా దొరకడంతో, ప్రతి దగ్గుకి ఒక బాటిల్ సిరప్ కొనడం అలవాటైపోయింది. ఈ అలవాటు కొన్నిసార్లు ప్రాణాలకు ధరగా మారుతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జరిగిన ఘటనలే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు, ఇది ప్రతి కుటుంబానికి ఒక జాగ్రత్త సూచన. ఒక బాటిల్ దగ్గు సిరప్, ప్రాణాన్ని కాపాడుతుందా లేక ప్రాణాన్ని తీసేస్తుందా అనేది ఇప్పుడు ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం మాత్రం రెండు సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వకండని చెబుతోంది. అవసరం లేని దగ్గు మందుల వాడకాన్ని తగ్గించాలని చెబుతోంది. ఇటు తల్లిదండ్రులు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు.. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే, మన పిల్లల ప్రాణాలు ఎలా సేఫ్‌గా ఉన్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానాలు తక్షణం రావాలి. కఠినమైన నిబంధనలు, పారదర్శకమైన తనిఖీలు, బాధ్యులపై శిక్ష తీసుకోకపోతే నేటి విషాదం రేపటికి కొనసాగుతోంది. చివరగా ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దగ్గు అనేది సాధారణం. సిరప్ అనేది ఒక చిన్న బాటిల్. కానీ ఆ చిన్న బాటిల్ లోపల దాగి ఉండే మిశ్రమం ఒక కుటుంబ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. తెలుసుకుని ఉండండి. ఆరోగ్యం కోసం తీసుకునే ఔషధమే మరణానికి కారణం కాకూడదు కదా..! సో బీ కేర్‌ఫుల్..!
