Let's talk: editor@tmv.in
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పు

ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పు

Shaik Mohammad Shaffee
27 అక్టోబర్, 2025

మహారాష్ట్రలోని చారిత్రక ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇకపై ఈ స్టేషన్‌ను 'ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్'గా పిలుస్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఔరంగాబాద్ నగరం పేరును మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడు సంవత్సరాల క్రితమే ఛత్రపతి శంభాజీనగర్ గా మార్చింది. ఈ పేరు మార్పు ఆ నిర్ణయానికి అనుగుణంగా రైల్వే స్టేషన్‌కు కూడా వర్తింపజేశారు.

ఈ పేరు మార్పు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, రెండో పాలకుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ కు నివాళిగా జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 15న ఈ పేరు మార్పును ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

రైల్వే స్టేషన్‌కు కొత్త కోడ్

ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్ కిందకు వస్తుంది. రైల్వే శాఖ ఈ స్టేషన్‌కు కొత్త కోడ్‌ను కూడా కేటాయించింది. పాత స్టేషన్ కోడ్ స్థానంలో ఇకపై 'CPSN' అనే కోడ్‌ను ఉపయోగించాలి. రైల్వే అధికారులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్టేషన్ బోర్డులు, రిజర్వేషన్ వ్యవస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, అనౌన్స్‌మెంట్‌లలో పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేశారు.

స్టేషన్ చరిత్ర, ప్రాముఖ్యత

ఈ రైల్వే స్టేషన్‌ను 1900 సంవత్సరంలో ప్రారంభమైంది.ఈ స్టేషన్‌ను హైదరాబాద్ ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. 'నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే' పరిధిలో గోదావరి వ్యాలీ రైల్వే కంపెనీని స్థాపించి, ఈ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ రైల్వే పనుల నిర్మాణం 1876 సంవత్సరంలో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలోనే ప్రారంభమైంది.

ఛత్రపతి శంభాజీనగర్ నగరం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అయిన అజంతా గుహలు, ఎల్లోరా గుహలు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ప్రయాణికులు ఇకపై రైలు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు లేదా రైలు సమయాలను తనిఖీ చేసేటప్పుడు ఛత్రపతి శంభాజీనగర్ అనే కొత్త పేరు, CPSN అనే కొత్త కోడ్‌ను ఉపయోగించాల్సిందిగా రైల్వే శాఖ సూచించింది.