
ఔదార్యం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం, తడకపల్లి గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. హాస్టల్ విద్యార్థులకు రూ. 6 లక్షల విలువైన కార్పొరేట్ స్థాయి బెడ్స్‌ను ఆయన అందజేశారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గతంలో తడకపల్లి బీసీ హాస్టల్‌ను సందర్శించినప్పుడు, విద్యార్థులతో మాట్లాడి, వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నాను విద్యార్థులు హాస్టల్‌లో మంచాల్లేమి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగానే, వెంటనే వాటిని సమకూర్చుతానని హామీ ఇచ్చాను అని తెలిపారు.ఆ మాటకు కట్టుబడి హరీష్ రావు రూ.6 లక్షల విలువైన, కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో ఉపయోగించే నాణ్యమైన బెడ్స్‌ను హాస్టల్ కోసం కొనుగోలు చేసి అందజేశారు. ఆధునిక వసతులతో కూడిన ఈ మంచాలు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులు మరింత బాగా చదువుకోవడానికి వీలు కలుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ బెడ్స్‌ను సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్‌కు పార్టీ నాయకుల సమక్షంలో హరీష్ రావు అధికారికంగా అందించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు, హాస్టల్ సిబ్బంది హాజరయ్యారు. హరీష్ రావు ఔదార్యానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దిపేట బాలికల హైస్కూల్‌లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన: ఇన్నోవేషన్‌కు ఆకాశమే హద్దు ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట బాలికల హైస్కూల్‌లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచం స్టార్టప్ యుగంలో నడుస్తోందని, ఇన్నోవేషన్ లేకపోతే మనం లేమని ఉద్ఘాటించారు.సైన్స్ ఫెయిర్ పిల్లల్లోని ఆలోచనలకు ఒక రూపాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు. కరెంట్, టెలిఫోన్ వంటివి అన్నీ ఇన్నోవేషన్ నుండే వచ్చాయని, నేడు కంప్యూటర్ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిందని పేర్కొన్నారు. "ఇన్నోవేషన్‌కు ఆకాశమే హద్దు," అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచ అభివృద్ధి మొత్తం ఇన్నోవేషన్‌పై ఆధారపడిందని, కరెంట్ నుంచి టెలిఫోన్ వరకు ప్రతి సౌకర్యం ఒకప్పటి ఆలోచనలనుంచే పుట్టిందని హరీష్ రావు గుర్తుచేశారు.ప్రతి విద్యార్థిలో ఒక సైంటిస్ట్, ఒక ఇంజనీర్ ఉంటాడు. మనం మనల్ని తక్కువ అంచనా వేయకూడదని విద్యార్థులను ప్రోత్సహించారు.
సిద్దిపేటలో ఈసారి 1,853 ప్రాజెక్టులు ప్రదర్శనకు రావడం గర్వకారణమని, ప్రతి ఏటా పాల్గొనే ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుండటం సానుకూల సంకేతమని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ సైన్స్ ఫెయిర్ సిద్దిపేటలో జరగడం ప్రాంతానికి మరింత పేరు తీసుకొస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రదర్శన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. డీఏలు, రిటైర్మెంట్ బకాయిలు, డీఆవోల లేమి, పీఆర్సీ జాప్యం వంటి అంశాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండి, పద్ధతిగా చదివి మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిద్దిపేటకు పేరు తీసుకురావాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
