
ఓ ఆర్ ఎస్ పేరుతో పానీయాలు నిషిద్ధం
హైదరాబాద్‌కు చెందిన శిశువైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్ చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించి, కీలకమైన ముగింపుకు చేరుకున్నాయి. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ కమీషనర్‌లకు, అన్ని కేంద్ర లైసెన్సింగ్ అథారిటీలకు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం, ఆహార వ్యాపార నిర్వాహకులందరూ తమ తీపి పానీయ ఆహార ఉత్పత్తుల నుండి "ఓ ఆర్ ఎస్ " అనే పదాన్ని తొలగించాల్సి ఉంటుంది.
ఈ సందర్బంగా డాక్టర్ శివరంజని మాట్లాడుతూ ఈ ఆదేశాలు తమకు "ఎంతో ఆనందం" కలిగించాయని తెలిపారు. తప్పుడు లేబులింగ్, అనైతిక మార్కెటింగ్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు “ఓ ఆర్ ఎస్ “ అనే పదాన్ని ఉపయోగించి ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో ఆమె వివరించారు.
“ఓ ఆర్ ఎస్” అనే పదాన్ని "తప్పుగా" ఉపయోగించే ఈ పానీయాలు వాస్తవానికి విరేచనాలు (డయేరియా) సమస్యను మరింత పెంచుతాయని కూడా ఆమె స్పష్టం చేశారు.
డాక్టర్ శివరంజని సంతోష్ మాట్లాడుతూ, "ఇది ఎంతో ఆనందకర విషయం అంటే, ఈ పానీయాల కారణంగా ఇంకా ఇప్పటినుండి విరేచనాలు ఎక్కువై ఏ పిల్లవాడు, ఏ పెద్దవాడు చనిపోరని అనుకుంటున్నాను. ఓఆర్‌ఎస్ ప్రాణాలను రక్షించడానికి ఉద్దేశించబడింది. ఇది 20వ శతాబ్దపు అద్భుత ఔషధం. ఇది ప్రాణాలను కాపాడటానికి, మనల్ని రీహైడ్రేట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇది మనకు అమృతం లాంటిది. కానీ కొన్ని ఉత్పత్తి సంస్థలు తమ అధిక చక్కెర పానీయాల డబ్బాల ద్వారా ఆదాయమార్గాన్ని పెంచుకోవడానికి ఓ ఆర్ ఎస్ అని లేబుల్ వేశారు. గత 14 సంవత్సరాలుగా, వారు మోసపూరిత లేబులింగ్, అనైతిక మార్కెటింగ్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ఫార్మసీలు, ఆసుపత్రులు, పాఠశాలలు అన్ని చోట్లా ఇదే జరుగుతోంది."
"కాబట్టి, విరేచనాల వల్ల కలిగే డీహైడ్రేషన్ నుండి వాస్తవానికి కోలుకోవడానికి సహాయపడాల్సిన ఒక ఉత్పత్తి, విరేచనాలను మరింత పెంచేదిగా ఉంది," అని ఆమె అన్నారు. డయేరియా కారణంగా ప్రతి ఏటా 13శాతం మందికి పైగా పిల్లలు మరణిస్తున్నారని నొక్కి చెబుతూ, ఓఆర్‌ఎస్ కి ప్రత్యామ్నాయంగా తమ పానీయాలను విక్రయిస్తున్న కంపెనీలపై డాక్టర్ శివరంజని సంతోష్ తీవ్రంగా మండిపడ్డారు.
భారతదేశంలో కూడా ఐదేళ్లలోపు వయసున్నఎక్కువ మంది పిల్లలు డయేరియా కారణంగా మరణిస్తున్నారు. విరేచనాలను మరింత తీవ్రతరం చేసేదాన్ని మనం ఎలా ఇవ్వగలం? దీని గురించి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు? 'సరే, ఇప్పుడు నా పోరాటం తర్వాత, ఈ సంస్థలన్నీ మేము మా పానియాల డబ్బా పై లేబుల్ లో ఇందులో చక్కెర వుంది అనే విషయాన్ని ముద్రించాము అని అంటున్నారు. అయితే అది చదవడం ప్రజల బాధ్యత. నిరక్షరాసుల మాట అటుంచితే భారతదేశంలో ఎంతమంది అక్షరాస్యులు నిజంగా ఈ లేబల్ ని చదువుతారు? “ఇది క్రూరం," అని ఆమె అన్నారు. కంపెనీలు, ప్రభుత్వంపై దావా వేయడానికి డాక్టర్ శివరంజని సంతోష్ తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లవలసి వచ్చింది. లెక్కలేనంత ఒత్తిడిని అనుభవించినప్పటికీ, తాను "దీని కోసమే పుట్టాను" అని ఆమె నమ్మారు. ఈ చారిత్రక నిర్ణయానికి దారితీసిన తన పోరాటాన్ని ఆమె కొనసాగించారు.
అందుకే, ఇంత ఉద్రిక్తత, ఒత్తిడి ఉన్నప్పటికీ, నా సొంత సోదర వర్గంతో పోరాడవలసి వచ్చినా, అధికారులకు వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించవలసి వచ్చినా, ప్రభుత్వం, ఈ కంపెనీలు రెండూ ప్రతివాదులుగా ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయవలసి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. మధ్యలో, నా కుటుంబానికి ఏదైనా జరుగుతుందేమోనని భయపడి నేను ఉద్రిక్తంగా, ఒత్తిడికి గురయ్యేదాన్ని, కానీ నేను దీన్ని చేయాలని, దీని కోసమే పుట్టానని భావించి నా మనస్సు నుండి ఆ ఆలోచనలను తొలగించేదాన్ని," అని ఆమె చెప్పారు. చాలా కంపెనీలు చక్కెర అధికంగా ఉండే పానీయాలను ఓ ఆర్ ఎస్ గా మార్కెటింగ్ చేస్తున్న విధానంపై డాక్టర్ సంతోష్ ఎనిమిది సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఆమె నిరంతర ప్రయత్నాల ఫలితంగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇప్పుడు ఈ ఆదేశాన్ని జారీ చేసింది. “ఓఆర్ఎస్” పదం విడిగా ఉపయోగించినా, ఏదైనా పానియానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించినా, లేదా ఉత్పత్తి పేరులో ట్రేడ్‌మార్క్‌లో భాగమైనా ఈ ఆదేశం వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారిక ప్రకటనలో ఇలా పేర్కొంది, "ఫ్రూట్ ఆధారిత, నాన్-కార్బోనేటెడ్ లేదా రెడీ-టు-డ్రింక్ పానీయాల వంటి ఏదైనా ఆహార ఉత్పత్తి పేరులో, అది ట్రేడ్‌మార్క్ చేయబడిన పేరులో ఉన్నా, వేరే విధంగా పేరు పెట్టబడినప్పుడు “ఓ ఆర్ ఎస్” అనే పదాన్ని ఉపయోగించడం, దానికి సరిపడా పదం జోడించినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006, దాని కింద రూపొందించబడిన నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. "ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006 దాని కింద రూపొందించబడిన నిబంధనల ప్రకారం సూచించిన లేబులింగ్, ప్రకటనల అవసరాలను కఠినంగా పాటించేలా చూడాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంబంధిత అధికారులందరినీ కోరింది.
గతంలో, ట్రేడ్‌మార్క్‌లో భాగంగా ఉత్పత్తి పేరులో ఓఆర్ఎస్ పదాన్ని ఆహార లేబుళ్లపై ఉపయోగించడానికి అనుమతించారు. అయితే, ఆ లేబుల్‌పై "ఈ ఉత్పత్తి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు" అనే హెచ్చరిక ఉండాలనే షరతు ఉండేది. అయితే, ఈ కేసు సమీక్ష తర్వాత, ఫ్రూట్ ఆధారిత, నాన్-కార్బోనేటెడ్ లేదా రెడీ-టు-డ్రింక్ పానీయాల వంటి ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఓఆర్ఎస్ పదాన్ని ట్రేడ్‌మార్క్ చేయబడిన పేరులో అయినా, మరే విధంగానైనా ఉపయోగించడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లే అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇప్పుడు స్పష్టం చేసింది.
