Let's talk: editor@tmv.in
ఓహియో గవర్నర్ అభ్యర్థి రామస్వామికి ట్రంప్ మద్దతు

ఓహియో గవర్నర్ అభ్యర్థి రామస్వామికి ట్రంప్ మద్దతు

Pinjari Chand
9 నవంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓహియో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేస్తూ రామస్వామిని ‘ప్రత్యేకమైన, తెలివైన, బలమైన నాయకుడిగా అభివర్ణించారు. ఓహియో రాష్ట్రంలో నేను 2016, 2020, 2024లో భారీ విజయాలు సాధించాను. వివేక్ రామస్వామి గవర్నర్‌గా పోటీ చేస్తున్నారు. ఆయన యంగ్, స్ట్రాంగ్, స్మార్ట్ అని ప్రశంసించారు. దేశాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి. ఆయన ఆర్థికాభివృద్ధికి, పన్నులు తగ్గించడానికి ‘మేడ్ ఇన్ యూఎస్‌ఏ’ను ప్రోత్సహించడానికి, సరిహద్దులను భద్రపరచడానికి, చట్టం, శాంతిని కాపాడటానికి పాటుపడుతున్నారు. ఓహియోకు అతను గొప్ప గవర్నర్ అవుతారు’ అని ట్రంప్ తెలిపారు.

రామస్వామి దీనికి ప్రతిస్పందిస్తూ ‘ధన్యవాదాలు, అధ్యక్షుడు ట్రంప్. ఓహియోను మరింత గొప్పది గా మారుద్దాం’ అంటూ ‘ఎక్స్‌’ లో పోస్టు చేశారు. రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు విజయాల కోసం గుర్తింపు రాజకీయాలపై కాకుండా ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నవంబర్ 5న రామస్వామి సూచించారు. గత ఎన్నికల్లో న్యూ జెర్సీ, వర్జీనియా, న్యూయార్క్‌లో రిపబ్లికన్లు ఎదుర్కొన్న పరాజయాలపై స్పందిస్తూ, పార్టీకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పారు. రామస్వామి జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన బయోటెక్ వ్యాపారవేత్త, 2024 ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రయత్నించారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ వైపే అందరూ మొగ్గడంతో రామస్వామి పోటీ నుంచి విరమించుకున్నారు. వివేక్ రామస్వామికి పోటీగా డెమోక్రాటిక్ ప్రధాన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎమి యాక్షన్, అలాగే టిమ్ రియాన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ గవర్నర్ ఎన్నికలు 2026 నవంబర్ 3 న జరగనున్నాయి.

ఓహియో గవర్నర్ అభ్యర్థి రామస్వామికి ట్రంప్ మద్దతు - Tholi Paluku