
ఓర్లీన్స్ మాస్టర్స్: కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమణ
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ ఓర్లీన్స్ మాస్టర్స్ 2026 టోర్నీలో అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రారంభ పోరులో శ్రీకాంత్ వరుస గేమ్‌లలో ఓటమి పాలయ్యాడు. డెన్మార్క్‌కు చెందిన మాగ్నస్ జోహన్నెసెన్ చేతిలో 12-21, 10-21 తేడాతో పరాజయం చెందాడు. మ్యాచ్ ప్రారంభంలో 5-2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, జోహన్నెసెన్ అద్భుతంగా పుంజుకుని శ్రీకాంత్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం 26 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో శ్రీకాంత్ చేతులెత్తేశాడు.
ఆయుష్ శెట్టి ముందంజ
శ్రీకాంత్ నిరాశపరిచినప్పటికీ, 2025 యూఎస్ ఓపెన్ విజేత ఆయుష్ శెట్టి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తోటి భారతీయుడు కిరణ్ జార్జ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆయుష్ 17-21, 21-10, 21-17తో విజయం సాధించాడు. తొలి గేమ్‌ను కిరణ్ గెలుచుకున్నా, ఆ తర్వాతి రెండు గేమ్‌లలో ఆయుష్ తన దూకుడును ప్రదర్శించి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో కిరణ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయంలో ఆయుష్ ఒత్తిడిని అధిగమించి గెలుపొందాడు.
రాణించిన మహిళా షట్లర్లు
మహిళల సింగిల్స్‌లో యువ కెరటం అన్మోల్ ఖర్బ్ శుభారంభం చేసింది. టర్కీకి చెందిన ఒలింపియన్ నెసిల్హాన్ అరిన్‌పై 21-12, 21-16తో ఘనవిజయం సాధించి రెండో రౌండ్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్ 21-18, 21-14తో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ షువో-యున్‌ను ఓడించింది. ఇక తన్వీ శర్మ సంచలన విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ స్టార్, సెకండ్ సీడ్ సుపానిదాతో జరుగుతున్న పోరులో తన్వీ 21-18, 14-12తో ఆధిక్యంలో ఉండగా.. ప్రత్యర్థి గాయం కారణంగా రిటైర్ కావడంతో తన్వీని విజేతగా ప్రకటించారు.
మిశ్రమ ఫలితాలు
మరోవైపు రక్షిత రామరాజ్, దేవిక సిహాగ్ తొలి రౌండ్‌లోనే ఓటమిని చవిచూశారు. రక్షిత 9-21, 15-21తో జపాన్ క్రీడాకారిణి మనమి సుయిజు చేతిలో ఓడిపోగా, దేవిక సిహాగ్ 21-15, 14-21, 15-21తో హాంకాంగ్‌కు చెందిన లో సిన్ యాన్ చేతిలో పోరాడి ఓడింది. మిశ్రమ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనిషా క్రాస్టో జోడీ కూడా 14-21, 18-21తో ఇండోనేషియా జంట దేజన్-బెర్నాడిన్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
