
ఓయూకు వెయ్యి కోట్లు మంజూరు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ, చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)కు గత వైభవాన్ని తీసుకురావడంతో పాటు, దానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సీఎం తెలిపారు.
వెయ్యి కోట్లు మంజూరు, మాస్టర్ ప్లాన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ. 1,000 కోట్లు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా విడుదల చేశారు. యూనివర్సిటీ మాస్టర్ ప్లాన్, డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఓయూ: అలనాటి స్ఫూర్తి, భవిష్యత్తు ప్రణాళిక
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఏడు వ స్థానం, దక్షిణ భారతదేశంలో మూడో స్థానంలో నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అలనాటి స్ఫూర్తితో భవిష్యత్ రూపకల్పన చేయడానికి అందరినీ కలవాలనే ఉద్దేశంతో వచ్చానని ఆయన అన్నారు. ఈ యూనివర్సిటీపై నాకు ప్రత్యేకాభిమానముంది. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం నా సంకల్పం అని పేర్కొన్నారు.విద్యార్థులు సమాజ సమస్యలపై ప్రతిసారి ముందుండి పోరాడారని, తెలంగాణ ఉద్యమం కూడా అదే స్ఫూర్తితో విజయవంతమైందని సీఎం గుర్తుచేశారు. ఉస్మానియా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ప్రపంచానికి దిక్సూచిలా ఎదగేలా దీన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్య మాత్రమే వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే అడ్డాల మేడలు కాదని, పేదలకు చేరే అసలు సంక్షేమమే నిజమైన అభివృద్ధి అని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ పాటను ప్రకటించడం, బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం ప్రజా ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న దళితుల వర్గీకరణ సమస్యను పరిష్కరించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా గుర్తుచేశారు. అలాగే దేశంలో మొదటిసారిగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి ఆధారిత కుల గణన పూర్తి చేయడం ద్వారా కేంద్రాన్ని 2026 జనగణనలో ఈ అంశాన్ని చేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చామని తెలిపారు.
విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించామని సీఎం తెలిపారు. జ్ఞానం, కట్టుబాటు, ధైర్యం ఉంటే దేశంలో ఏ స్థాయికి అయినా ఎదగొచ్చు. యూనివర్సిటీలో నియామకాలు, నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉండనివ్వం, అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాశీం తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో సీఎం పర్యటనకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ సందర్శించిన సందర్భంగా, విద్యార్థి సంఘాల నాయకులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ సీఎం పర్యటనను వారు వ్యతిరేకించారు.
ప్రధాన డిమాండ్లు
ప్రధానంగా ఉద్యోగ నియామకాలు, జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి, విద్యార్థి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల నిరాశ, అసంతృప్తి నెలకొన్నట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, అది కూడా కార్యరూపం దాల్చలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రక ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తుచేసిన నిరసనకారులు, విద్యార్థి సమస్యలను పరిష్కరించకుండా కేవలం పర్యటనలు చేయడం అనవసరమని స్పష్టం చేశారు. ముందు హామీలు నెరవేర్చండి, తర్వాత పర్యటనలు చేయండి అని విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉద్రిక్త వాతావరణం, అరెస్టులు
సీఎం పర్యటన నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.నిరసనకారులు "సీఎం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనను ఉధృతం చేశారు. నిరసనలు నివారించేందుకు వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. దీనిపై విద్యార్థులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తూ, ఇది విద్యార్థుల నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును అణచివేత అని వ్యాఖ్యానించారు.
ఈ నిరసన సీఎంకు స్వాగతం పలకడం కంటే, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, విద్యా సంబంధిత హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
