Let's talk: editor@tmv.in
ఓబీసీల ‘క్రీమీలేయర్’కు తల్లిదండ్రుల ఆదాయం ఒక్కటే ప్రమాణం కాదు: సుప్రీం

ఓబీసీల ‘క్రీమీలేయర్’కు తల్లిదండ్రుల ఆదాయం ఒక్కటే ప్రమాణం కాదు: సుప్రీం

Pinjari Chand
13 మార్చి, 2026

ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) రిజర్వేషన్ ఇవ్వడంలో ‘క్రీమీ లేయర్’ నిర్ణయాన్ని కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా మాత్రమే నిర్ణయించలేమని భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ప్రైవేట్ సంస్థలు లేదా పీఎస్‌యూ ఉద్యోగుల పిల్లలను వేర్వేరుగా చూడడం వివక్షకు సమానం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వ అప్పీలు తిరస్కరణ

న్యాయమూర్తులు పీఎస్.నరసింహ, ఆర్‌‌.మహదేవన్‌లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) ప్రయోజనాలపై వచ్చిన కేసుల్లో ఢిల్లీ హైకోర్టు, మద్రాస్, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ప్రైవేట్ సంస్థలు లేదా పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పిల్లలు ఒకే పరిస్థితిలో ఉన్నప్పటికీ వారిని వేర్వేరు విధంగా చూడడం ‘హోస్టైల్ డిస్క్రిమినేషన్’ (శత్రుత్వ వివక్ష) అవుతుందని కోర్టు పేర్కొంది.

ఆదాయం ఒక్కటే ప్రమాణం కాదు

క్రీమీ లేయర్ నిర్ణయంలో కేవలం ఆదాయం మాత్రమే ప్రమాణం కాదు. తల్లిదండ్రుల పదవి స్థాయి, ఉద్యోగ వర్గం కూడా పరిగణనలోకి తీసుకోవాలని, కేవలం జీతం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని కోర్టు తెలిపింది రిజర్వేషన్ ద్వారా నిజంగా సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం అందాలనే ఉద్దేశంతోనే క్రీమీ లేయర్ వ్యవస్థ అమల్లో ఉందని కోర్టు పేర్కొంది. సామాజికంగా ముందుకు వచ్చిన వర్గాలు రిజర్వేషన్ ప్రయోజనాలను ఎక్కువగా పొందకుండా నిరోధించడమే ఈ వ్యవస్థ లక్ష్యమని వివరించింది.

పాత మార్గదర్శకాలపై కోర్టు వ్యాఖ్య

కేంద్ర ప్రభుత్వం 1993లో జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వు (ఆఫీస్‌ మోమోరండం )లో క్రీమీ లేయర్ నిర్ణయంలో జీతం, వ్యవసాయ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోరాదని పేర్కొంది. అయితే 2004లో ఇచ్చిన వివరణాత్మక లేఖలో పీఎస్‌యూ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాన్ని కూడా ఆదాయంగా పరిగణించాలని చెప్పడం గమనించదగ్గ విషయమని కోర్టు పేర్కొంది. అందువల్ల జీతం మాత్రమే ఆధారంగా క్రీమీ లేయర్ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.