
ఓపెన్ జైళ్ల వినియోగం తగ్గడం ఆందోళనకరం: సుప్రీం
దేశంలో ఓపెన్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఓపెన్ జైళ్లు) సద్వినియోగం చాలా తక్కువగా ఉండటం చాలా తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ఒక వైపు రాష్ట్రాలు జైళ్లలో అతి రద్దీ సమస్యతో సతమతమవుతుంటే, మరోవైపు ఓపెన్ జైళ్లు ఉన్నాకూడా వాటిని సరిగ్గా వినియోగించుకోవడం లేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. సెమీ-ఓపెన్, ఓపెన్ జైళ్ల భావనను ఖైదీలకు సమాజంలో పునరావాసం కల్పించడానికి సహాయపడేందుకు ప్రవేశపెట్టారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం... కేరళ రాష్ట్రం సమర్పించిన దరఖాస్తును అనుమతిస్తూ, 457 ఎకరాల్లో 257 ఎకరాల భూమిని ఓపెన్ జైలు కోసం కేటాయించిన భూమిలో బ్రహ్మోస్ ప్రాజెక్టు, ఇతర సౌకర్యాల కోసం ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది.
కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాలు
బ్రహ్మోస్ ప్రాజెక్టుకు 180 ఎకరాలు, సశస్త్ర సీమా బల్ కోసం 45 ఎకరాలు, జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ కోసం 32 ఎకరాలు అవసరమని పేర్కొంది. జైలు రద్దీ సమస్యపై అమికస్ క్యూరీగా సహాయం అందిస్తున్న సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వర్ కేరళ దరఖాస్తును అనుమతించాలని సూచించగా, కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు, బ్రహ్మోస్ ప్రాజెక్టు “జాతీయ రక్షణ ప్రాజెక్టు” అని తెలిపారు. ధర్మాసనం ఈ దరఖాస్తును అనుమతించింది. విచారణ సందర్భంగా ఓపెన్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సద్వినియోగంలో ఉన్న లోపంపై అమికస్ క్యూరీ దృష్టి తెచ్చారు. ఒకవైపు జైళ్లలో అతి రద్దీ సమస్య ఉండగా, మరోవైపు ఓపెన్ జైళ్లు ఉన్నాకూడా వాటిని వినియోగించుకోవడం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం ఎందుకు ఈ విషయంలో పాలసీ రూపొందించకూడదని కోర్టు ప్రశ్నించింది.
అమికస్ క్యూరీ తెలిపిన వివరాలు
• కేంద్రం ఇప్పటికే మాన్యువల్, మోడల్ జైలు రూల్స్ డ్రాఫ్ట్‌ను రూపొందించింది.
• అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసి, ఓపెన్ జైళ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది.
• కనీసం 6-7 రాష్ట్రాల్లో ఓపెన్ జైళ్లు 50-60 శాతం కంటే తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి.
• మూడు, నాలుగు రాష్ట్రాల్లో మహిళా ఖైదీలను ఓపెన్ జైళ్లలో అనుమతించడం లేదు.
ఈ విషయంలో భద్రతా ఆందోళనలు కారణమవుతాయని, ఓపెన్ జైళ్లలో కఠిన భద్రత ఉండదని, ఇద్దరు, ముగ్గురు గార్డులే చాలని ధర్మాసనం గమనించింది. ఈ సమస్యలను రాష్ట్రాలు పరిష్కారించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉన్న సౌకర్యాలనైనా సద్వినియోగం చేసుకోవాలి అని కోర్టు నొక్కి చెప్పింది. రాష్ట్రాలు ఆసక్తి చూపడం లేదని, అమికస్ సమర్పించిన నోట్‌ను పరిశీలించి వివరణాత్మక ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపి, ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. గత విచారణల్లోనూ ఓపెన్ జైళ్లను ఏర్పాటు చేయడం జైలు రద్దీని తగ్గించడమే కాకుండా, ఖైదీల పునరావాసానికి కూడా ఒక పరిష్కారం అని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.
పౌర వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చడంలో పోలీసులు, క్రిమినల్ కోర్టులు జాగ్రత్త వహించాలి
పౌర వివాదాలు (సివిల్ డిస్ప్యూట్స్) నడుస్తున్నప్పుడు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ, క్రిమినల్ కోర్టులు నేరారోపణ (ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్) చేయడంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. జస్టిస్ నోంగ్మేకపం కోటిశ్వర్ సింగ్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పులో పేర్కొంటూ న్యాయపాలనే ఆధారమైన సమాజంలో చార్జిషీట్ దాఖలు చేయాలా? వద్దా అనే నిర్ణయం పూర్తిగా దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలు, శిక్ష పడే అవకాశం ఉందా? లేదా అనే అంచనాపై ఆధారపడి ఉండాలని వివరించింది.
పార్టీల మధ్య పౌర వివాదం పెండింగ్‌లో ఉన్నప్పుడు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ, క్రిమినల్ కోర్టులు నేరారోపణ చేయడంలోనూ అత్యంత సంయమనం పాటించాలి. చార్జిషీట్ దశలో పోలీసులు, నేరారోపణ దశలో కోర్టు ఇవి రెండూ మొదటి ఫిల్టర్‌లుగా పనిచేయాలి. బలమైన అనుమానం ఉన్న కేసులు మాత్రమే ట్రయల్ దశకు వెళ్లేలా చూడాలి. అలా చేయకపోతే న్యాయవ్యవస్థ సామర్థ్యం, పవిత్రత దెబ్బతింటాయి. బలమైన అనుమానం లేకుండానే చార్జిషీట్లు దాఖలు చేసే పద్ధతి న్యాయవ్యవస్థను అడ్డుకుంటుందని, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, ప్రాసిక్యూటర్లు చివరికి నిర్దోషులుగా తేలే కేసులపై అనవసరంగా సమయం ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇది తీవ్రమైన, ముఖ్యమైన కేసులకు అందుబాటులో ఉన్న పరిమిత న్యాయ వనరులను తప్పుదోవ పట్టిస్తుందని, ఫలితంగా కేసుల బ్యాక్‌లాగ్ భారీగా పెరుగుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
నేరారోపణ దశలో శిక్ష పడుతుందా లేదా అని విశ్లేషించలేమని, కానీ ప్రాథమిక సూత్రం ఒక్కటే – శిక్ష పడే సహేతుక అవకాశం లేకుండా ప్రభుత్వం పౌరులపై కేసు పెట్టరాదు. అలా చేస్తే న్యాయమైన విచారణ హక్కు దెబ్బతింటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ అభిప్రాయాలు కలకత్తా హైకోర్టు తోసిపుచ్చిన ఒక డిశ్చార్జ్ అప్లికేషన్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో వెలువడ్డాయి. ఆ కేసులో అక్రమ నిర్బంధం క్రిమినల్ బెదిరింపు నేరాలు మోపారు. కానీ ఆ ఆస్తికి సంబంధించి ఇప్పటికే పౌర వివాదం పెండింగ్‌లో ఉండటం, ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ఉండటం పోలీసులు, ట్రయల్ కోర్టు గమనించి ఉండాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
