Let's talk: editor@tmv.in
ఓట్ చోరీపై ఏపి కాంగ్రెస్ సంతకాల సేకరణ

ఓట్ చోరీపై ఏపి కాంగ్రెస్ సంతకాల సేకరణ

Gangadhar Veerla
16 సెప్టెంబర్, 2025

సోమవారం నుంచి అక్టోబర్ 15 వరకు ఓట్ చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఒక ప్రకటనలో ఆయా వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఆయా వివరాలు ఆమె మాటల్లోనే.

నేడు దేశ ప్రజల ఓటు హక్కు కాపాడటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. మన నాయకులను మనం ఎన్నుకొనే స్వేచ్ఛ ఇచ్చింది. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు ఉంది. ఎన్నికల్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి. కానీ ఎన్నికలసంఘం ప్రధాని మోడీ గారి చేతిలో బంధి అయ్యిందని అన్నారు షర్మిల

సీబిఐ, ఈడి, ఆదాయపన్నుశాఖ, ఆర్బీఐ స్టాక్ ఎక్స్ఛేంజ్ లాంటి అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పని చేస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పని చేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టారు. ఇది పచ్చి నిజం. ఇది మన భారత దేశ ప్రజాస్వామ్య యదార్ధత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారాన్ని బయట పెట్టారు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజక వర్గాన్ని ఒక శాంపిల్ గా తీసుకున్నారు. ఒక లక్ష దొంగ ఓట్లను నమోదు చేశారు. అన్ని దొంగ ఫొటోలు, దొంగ పేర్లు, దొంగ అడ్రస్లేనని ఎద్దేవా చేశారు

అంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా కొత్త ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లు ఎవరు వేశారు ? సీసీటీవి ఫుటేజ్ ఎక్కడ ఉంది ? అంటే ఈసీఐ దగ్గర ఏ ఆధారాలు లేవు. అలాగే 5 ఏళ్లలో కంటే ఎన్నికలకు 5 నెలల ముందు కోటికి పైగా కొత్త ఓట్లు నమోదు అయ్యాయి. ఇది అన్యాయం కాదా ? ఓట్ చోరీ కోసం ఇదంతా చేయలేదా ? ఎన్నికల సంఘం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లను తొలగించిందని ఆమె ఆరోపించారు

బీజేపీకి అనుకూలంగా దొంగ ఓట్లను నమోదు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఓట్ చోరీ పై దేశ వ్యాప్త పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటాన్ని ఎత్తుకున్నాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలి. సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని రాష్ట్ర ప్రజలకు మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.

ఓట్ చోరీపై ఏపి కాంగ్రెస్ సంతకాల సేకరణ - Tholi Paluku