
ఓట్ చోరీ ప్రజాస్వామ్యంపై దాడి: రాహుల్ గాంధీ
బీజేపీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తీవ్రమైన దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్ చోరీ’ ప్రధాన సమస్యగా పేర్కొంటూ బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ల దొంగతనాన్ని వ్యవస్థీకృతం చేస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని పచ్మఢిలో జరుగుతున్న ‘సంఘటన్ సృజన్’ శిక్షణ శిబిరంలో ఆదివారం రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 10 రోజుల శిక్షణా శిబిరంలో ఏడవ రోజు రాహుల్ గాంధీ మూడు గంటలపాటు జిల్లా అధ్యక్షులతో సమావేశమై, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్యానాలో 25 లక్షల ఓట్లు దొంగలించారు. అంటే ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి చోరీ చేశారు. ఈ వ్యవస్థను బీజేపీ, ఎన్నికల కమిషన్ కలసి నడుపుతున్నాయి. మాతో మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలో చూపిస్తాం అని రాహుల్ తెలిపారు.
ఎస్ఐఆర్ అనే సిస్టమ్ దొంగతనాన్ని కప్పిపుచ్చేందుకే
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాన సమస్య ‘ఓట్ చోరీ’ది. ఎస్ఐఆర్ అనేది ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చే వ్యవస్థ. ఇది ఓ అధికారిక దొంగతన యంత్రాంగం’ అని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కలిసి ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ‘భారతమాతకు నష్టం కలిగిస్తున్నారని’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఎన్నికల మోసం కాదు, ఇది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై నేరుగా దాడి అని అన్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పాట్వారీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రణాళిక మధ్యలో ఒకరోజు సమయం కేటాయించి వచ్చారు. ఆయన మూడు గంటల సెషన్ నిర్వహించి, పార్టీ బలోపేతం కోసం సూచనలు ఇచ్చారు. రాత్రి పచ్మఢిలోనే బస చేస్తారు అని తెలిపారు. మరోనేత కాంతిలాల్ భూరియా మాట్లాడుతూ బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ప్రజల్లో అవగాహన కలిగించింది. క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు జాగృతమైతేనే బీజేపీ ‘ఓట్ చోరీ’ని అడ్డుకోగలమన్నారు.
యువత అప్రమత్తంగా ఉండాలి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్ణియా లో తీవ్ర ఆరోపణలు చేశారు. నేను స్పష్టంగా చెబుతున్నాను మోడీ, షా, జ్ఞానేశ్ కుమార్ ఓట్లను దొంగలిస్తున్నారు. వారి ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోంది అని ఆయన మండిపడ్డారు. బీహార్ యువత, ముఖ్యంగా జెన్ జడ్ తరం, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మీ భవిష్యత్తును వారు దొంగలించాలనుకుంటున్నారు. అందుకే ఓట్లు దొంగలిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద మీరు కళ్లు మూసుకోకండి. జాగ్రత్తగా ఉండండి అని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ రక్తంలో పగ, ద్వేషం ఉంది. ఆయన దాన్నే ప్రజలకు పంచుతున్నారు. మేం అందరినీ ఒక దగ్గర చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. బీహార్ లో సరైన విద్యా వ్యవస్థ లేదు. ఇక్కడున్న అన్ని వ్యవస్థలను ఎన్డీయే నిర్వీర్యం చేస్తున్నారు. నిరుద్యోగాన్ని పెంచుతున్నారు. బీహార్ ప్రజలు ఎక్కడున్నా శ్రమించి పనిచేస్తున్నారు. కానీ ఇక్కడే వారికి ఎందుకు ఉపాధి కల్పించడం లేదు. నీతిశ్, ప్రధాని ఉపాధిని కల్పించడం లేదు. పూర్తిగా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. వారు ఎంత సేపు విద్వేషాలు పెంచుతూ పబ్బం గడుపుతున్నారని గుర్తు చేశారు.
‘మేడ్ ఇన్ చైనా’ కాదు.. ‘మేడ్ ఇన్ బీహార్’ కావాలి
కిషన్‌గంజ్‌లో జరిగిన మరో సభలో ఆయన బీహార్ సీఎం నీతీశ్ కుమార్, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. గత 20 ఏళ్లలో నీతీశ్ ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారు? అమిత్ షా చెబుతున్నారు బీహార్‌లో పరిశ్రమలకు భూమి లేదని. అది అబద్ధం.అదానీకి మాత్రం ఎకరానికి రూపాయి చొప్పున భూమి ఇస్తున్నారు అని రాహుల్ గుర్తు చేశారు. మేడ్ ఇన్ చైనా బదులు మేడ్ ఇన్ బీహార్ అని మొబైల్ ఫోన్లపై రాయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
