Let's talk: editor@tmv.in
ఓట్ల కోసం టోపీ ధరించాల్సి వస్తే తల నరుక్కుంటా: కేంద్రమంత్రి బండి

ఓట్ల కోసం టోపీ ధరించాల్సి వస్తే తల నరుక్కుంటా: కేంద్రమంత్రి బండి

Gaddamidi Naveen
8 నవంబర్, 2025

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో వేడి చెలరేగింది.బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడానికే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తలపై టోపీ ధరించారని ఆయన ఆరోపించారు.

మంత్రి బండి సంజ‌య్ మాట్లాడుతూ ఒక‌ రోజు ఓట్ల కోసం నేను తలపై టోపీ వేసుకోవాల్సి వస్తే, నా తలనే నరుక్కుంటా. నేను నిర్భయ హిందువును. ఇతర మతాలను అవమానించేంత వరకు నటన చేయను అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ముస్లిం నాయకులు అజారుద్దీన్‌, ఓవైసీ లాంటి వారు కూడా ఈ టోపీ ధ‌రించలేదు. కానీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ మాత్రం రాజకీయ లాభం కోసం ధరించారు. ఓట్ల కోసం నటించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

అత‌ను సవాల్‌ విసురుతూ, రేవంత్ రెడ్డి నిజంగా ధైర్యవంతుడైతే అజారుద్దీన్‌ను పిలిచి ‘వక్రతుండ మహాకాయ’ శ్లోకం చెప్పమంటారా? లేదా ఓవైసీని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి భక్తిగీతం పాడమంటారా? అని మంత్రి బండి ప్రశ్నించారు.

ఇటీవలి జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్యారమౌంట్ కాలనీలో జరిగిన సభలో స్కల్ క్యాప్‌ ధరించి ప్రసంగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వివాదం చెలరేగింది.

ఇక మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. “కాళేశ్వరం అవినీతి కేసులో మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయలేదని” ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులతో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ నేతలపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? అని విమర్శించారు.

మరణించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్‌ స్థానానికి నవంబర్‌ 11న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి బీసీ వర్గానికి చెందిన వి. నవీన్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి గోపీనాథ్‌ భార్య సునీత, బీజేపీ తరఫున లంకాల దీపక్‌ రెడ్డి పోటీలో ఉన్నారు.

ఓట్ల కోసం టోపీ ధరించాల్సి వస్తే తల నరుక్కుంటా: కేంద్రమంత్రి బండి - Tholi Paluku