
ఓట్ల కోసం అస్సాంలో పొలి‘టీ’కల్ చక్కర్లు
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభావవంతమైన టీ తోటల గిరిజన సముదాయం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సుమారు 35 లక్షల ఓటర్లతో ఉన్న ఈ వర్గం తూర్పు అస్సాంలో ఎక్కువగా నివసిస్తూ కనీసం 35 నియోజకవర్గాల్లో ఫలితాలను నిర్ణయించే స్థాయిలో ప్రభావం చూపగలదు. మరో పది స్థానాల్లో కూడా ఈ సముదాయం ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో టీ తోటల కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన ఎస్టీ హోదా, రోజువారీ వేతనాల పెంపు, భూమిపై హక్కులు మళ్లీ రాజకీయ చర్చల కేంద్రంగా మారాయి.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత పదేళ్లలో టీ తోటల కార్మికుల జీవన పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని పేర్కొంటోంది. ముఖ్యంగా తోటలలో నివసించే కార్మికులకు భూమి హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ టీ మోర్చా అధ్యక్షుడు డులెన్ నాయక్ మాట్లాడుతూ విద్య, రహదారులు, సంక్షేమ పథకాల ద్వారా టీ తోటల కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. అలాగే తమ పాలనలో రోజువారీ వేతనాలు బ్రహ్మపుత్ర లోయలో రూ.126 నుంచి రూ.280కు, బరక్ లోయలో రూ.105 నుంచి రూ.258కు పెరిగాయని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే దశలవారీగా వేతనాలను రూ.500కు పెంచుతామని హామీ ఇచ్చారు.
డిజిటల్ పట్టాలతో భవిష్యత్‌లో సమస్యలు..కాంగ్రెస్
ఇదే సమయంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ వాదనలను ఖండించింది. అస్సాం చా మజ్దూర్ ఆదివాసి కాంగ్రెస్ అధ్యక్షుడు అతువా ముండా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలు ప్రజల జీవితాల్లో వాస్తవ మార్పు తీసుకురాలేదని విమర్శించారు. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ‘డిజిటల్ పట్టాలు’ చట్టబద్ధత లేనివని, భవిష్యత్తులో కార్మికులు, తోటల యాజమాన్యాల మధ్య వివాదాలకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. ఇవి ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునే చర్యలేనని అన్నారు. అలాగే టీ తోటల కార్మికులకు ఎస్టీ హోదా కల్పించడం, రోజువారీ వేతనాలను రూ.351కు పెంచడం వంటి ముఖ్య హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఒక్కసారి ఇచ్చే రూ.5,000 ఆర్థిక సహాయం కార్మికులకు దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఇవ్వదని కూడా పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో టీ తోటల కార్మికులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో పాటు పరిశ్రమల కనీస వేతనాలు అమలు చేయడం, సంక్షేమ పథకాలను విస్తరించడం వంటి హామీలు ఇచ్చింది.
పరిష్కారం కానీ సమస్యలు
ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి చిన్న పార్టీలు కూడా టీ తోటల కార్మికుల ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇంతటి రాజకీయ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎస్టీ హోదా, గణనీయమైన వేతనాల పెంపు వంటి ప్రధాన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తమ ఓటు విలువను బాగా తెలుసుకున్న టీ తోటల కార్మికులు ఈసారి ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
