
ఓటు హక్కు తీసేస్తున్నారు..రేపు పౌరసత్వం కూడా తీసేస్తారు: మమతా బెనర్జీ
బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, భవిష్యత్తులో పౌరసత్వాన్ని కూడా హరించే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. జల్పైగురి జిల్లాలోని మయనగురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా ప్రజల ఓటు హక్కులను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈసీ, బీజేపీ, కేంద్రం రాజ్యాంగాన్ని అనుసరించడం లేదు. ప్రజల ఓటు హక్కులను లాక్కుంటున్నారని మమతా పేర్కొన్నారు. అదేవిధంగా, బీజేపీ ప్రజల ఆహారపు అలవాట్లు, భాషను నియంత్రించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో చేపలు, మాంసం తిన్నందుకు ప్రజలను కొడుతున్నారు. బెంగాలీ మాట్లాడినా దాడులు చేస్తున్నారు. కానీ మేం ప్రతి మతాన్ని, భాషను, సమాజాన్ని గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలే తనకు అతిపెద్ద బలం అని ఆమె నొక్కిచెప్పారు. వారు నా నుండి అన్నీ లాగేసుకున్నారు… ఇప్పుడు నాకు మిగిలింది ఒక్కటే.. ప్రజలని తెలిపారు.
ఎన్‌ఆర్‌సీపై హెచ్చరిక
ప్రస్తుత పరిణామాలను స్వాతంత్ర్య సమయంతో పోల్చుతూ ఈ రోజు ఓటు హక్కులు తీసేస్తున్నారు… రేపు నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ పేరుతో పౌరసత్వాన్ని కూడా తీసేస్తారని ఆమె అన్నారు. ఓటరు జాబితా సవరణ వల్ల రాజ్‌బంశీ సమాజం, మహిళల పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళ పేరు తీసేయడం అంటే మొత్తం మహిళా వర్గాన్ని దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. నవంబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ కారణంగా 220 మంది మరణించారు. వారి ఆత్మలు ఈ రోజు రోదిస్తున్నాయి. బీజేపీ గుర్తుంచుకోవాలి… దీనికి వారు సమాధానం చెప్పాల్సిందే అని ఆమె అన్నారు. దీర్ఘకాలంగా ఇక్కడే నివసిస్తున్న వారిని విదేశీయులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపిస్తూ ఇంతకాలం ఈ నేలపై జీవించిన తర్వాత మమ్మల్ని విదేశీయులని పిలుస్తూ, పౌరసత్వం నిరూపించమంటున్నారు. ముందు మీరు ఈ దేశ పౌరులో కాదో నిరూపించండి, తర్వాతే ప్రజలను సవాలు చేయండని బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పరోక్షంగా విమర్శిస్తూ ఈ ముగ్గురికి ప్రజలు గుడ్‌బై చెప్పాలని అన్నారు.
సంక్షేమ పథకాల ప్రస్తావన
ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ లక్ష్మీర్ భండార్, స్వస్థ్య సాథి, ఉచిత రేషన్ ఇవన్నీ ప్రజల కోసం అమలు చేసిన పథకాలేనని ఆమె తెలిపారు. అలాగే ఇంధన ధరలు పెరగడం, ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆలస్యం వంటి అంశాలపై కేంద్రాన్ని విమర్శించారు. గ్యాస్ బుక్ చేస్తే 35 రోజులు పడుతుందని చెబుతున్నారు. ప్రజలు ఎలా వంట చేసుకుంటారు? అని ప్రశ్నించారు. బూత్ క్యాప్చరింగ్ ప్రయత్నాలు జరిగితే మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఉత్తర బెంగాల్‌లో బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో, ఈ ప్రాంతంలో మమతా బెనర్జీ ప్రచారం రాజకీయంగా కీలకంగా మారింది.
