
ఓటు చోరీ.. దేశద్రోహం: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ల వేలికి పూసే ‘సిరా' (ఇండెలిబుల్ ఇంక్) తీవ్ర దుమారం రేపుతోంది. మార్కర్ పెన్నులతో పెట్టిన చుక్క సులభంగా చెరిగిపోతోందని, ఇది రిగ్గింగ్‌కు దారితీస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఓటు చోరీకి పాల్పడటం దేశద్రోహమే అవుతుంది. ఎన్నికల సంఘం ప్రజలను గ్యాస్‌లైటింగ్ (మానసిక వంచన) చేస్తోంది" అంటూ 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది.
చెరిగిపోతున్న సిరా చుక్క
బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న పోలింగ్‌లో వింత పరిస్థితి ఎదురైంది. ఓటు వేసిన తర్వాత వేలిపై పెట్టిన గుర్తు.. అసిటోన్ వంటి రసాయనాలతో తుడిస్తే ఇట్టే పోతోందని ఓటర్లు వాపోతున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబయి కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ వర్షా గైక్వాడ్ తన సహచరుడు వేలిపై ఉన్న సిరాను అసిటోన్‌తో తుడిచి చూపిస్తున్న వీడియోను షేర్ చేశారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే కూడా ఈ లోపాన్ని ఎత్తిచూపారు.
ప్రభుత్వంపై విపక్షాల విమర్శనాస్త్రాలు
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికార కూటమికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఆయన్ని వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విజయ్ వడెట్టివార్ సైతం ఇదే తరహా విమర్శలు చేస్తూ, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే కావాలని ఇలాంటి నాసిరకం సిరాను సరఫరా చేశారని మండిపడ్డారు. చిత్రంగా అధికార పక్షానికి చెందిన మంత్రి, శివసేన (షిండే వర్గం) నేత సంజయ్ శిర్సాత్ కూడా సిరా సులభంగా చెరిగిపోతోందన్న వాదనతో ఏకీభవించడం ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూర్చింది.
మార్కర్లకు గుడ్ బై.. పాత పద్ధతిలోనే సిరా
వివాదం ముదరడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాఘ్మరే స్పందించారు. మార్కర్ పెన్నుల నాణ్యతతో పాటు, వైరల్ అయిన వీడియోలపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఈ మార్కర్ పెన్నులను వాడబోమని, తిరిగి పాత పద్ధతిలోనే 'మైసూర్ పెయింట్స్' వారి ద్రవ రూప సిరానే వాడతామని ప్రకటించారు.
ఎస్‌ఈసీ వివరణ
కోరెస్ (ఇండియా) లిమిటెడ్ సరఫరా చేసిన ఈ పెన్నులను 2011 నుంచి స్థానిక ఎన్నికల్లో వాడుతున్నామని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే ఇవి ఉన్నాయని ఎస్‌ఈసీ అధికారులు పేర్కొన్నారు. సిరా మార్కు చెరిగిపోయినా, ఇతర భద్రతా చర్యలు ఉన్నందున ఒకరు రెండోసారి ఓటు వేయడం సాధ్యం కాదని కమిషన్ పేర్కొన్నప్పటికీ, విపక్షాలు మాత్రం తమ ఆందోళనను విరమించడం లేదు.
రాహుల్ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడి
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల వేళ సిరా నాణ్యతపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. కౌంటింగ్ పూర్తికాకముందే ఓటమి భయంతో రాహుల్ 'సాకుల ముఠా'ను సిద్ధం చేశారని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్‌ను 'ఖానీదానీ చోర్'గా అభివర్ణిస్తూ, వ్యవస్థలను దెబ్బతీయడమే ఆయన పని అని మండిపడ్డారు. గతంలో బీహార్ ఎన్నికలపైనా ఇలాగే నిరాధార ఆరోపణలు చేశారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాహుల్ ఎన్నికల సంఘంపై బురదజల్లుతున్నారని బీజేపీ ధ్వజమెత్తింది.
