Let's talk: editor@tmv.in
ఓటు చోరీ కుట్రలో ఈసీ కీలక భాగస్వామిగా మారింది: రాహుల్ గాంధీ

ఓటు చోరీ కుట్రలో ఈసీ కీలక భాగస్వామిగా మారింది: రాహుల్ గాంధీ

Pinjari Chand
25 జనవరి, 2026

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరిట గుజరాత్‌లో జరుగుతున్నది పూర్తిస్థాయి, ప్రణాళికాబద్ధమైన ‘ఓటు చోరీ’ అని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. ఈ కుట్రలో ఎన్నికల సంఘం (ఈసీ) కూడా కీలక భాగస్వామిగా మారిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ అనే రాజ్యాంగ హక్కును నాశనం చేసే ఆయుధంగా మార్చారని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలు కాకుండా బీజేపీనే అధికారంలో ఎవరు ఉండాలనేది నిర్ణయించే విధంగా ఈ ప్రక్రియను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో హిందీలో పోస్టు చేశారు.

ఎక్కడ ఎస్‌ఐఆర్ ఉంటే అక్కడ ఓటు దొంగతనం జరుగుతోంది. గుజరాత్‌లో జరుగుతున్నది సాధారణ పరిపాలనా ప్రక్రియ కాదు. ఇది పూర్తిగా ప్రణాళికతో, వ్యవస్థబద్ధంగా అమలు చేస్తున్న ఓటు చోరీ కుట్ర అని అన్నారు. వేల సంఖ్యలో అభ్యంతరాలు ఒకే పేరుతో దాఖలవడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రత్యేక వర్గాలు, బూత్‌లలోని ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారని ఆరోపించారు. బీజేపీ ఓటమి భయపడే చోట్ల ఓటర్లను వ్యవస్థ నుంచే అదృశ్యం చేస్తున్నారని అన్నారు. ఇదే తరహా విధానం అలాండ్, రాజురా ప్రాంతాల్లోనూ జరిగిందని, ఇప్పుడు అదే బ్లూప్రింట్‌ను గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈసీ మౌన ప్రేక్షకుడిలా వ్యవహారిస్తోంది

అత్యంత తీవ్రమైన నిజం ఏమిటంటే ఎన్నికల సంఘం ఇక ప్రజాస్వామ్యానికి రక్షకుడిగా వ్యవహరించడం లేదు. ఓటు చోరీ కుట్రలో భాగస్వామిగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై గుజరాత్ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ, రాహుల్ గాంధీ ఓటు మోసాన్ని బహిర్గతం చేసిన తర్వాత బీజేపీ ఎన్నికల మోసానికి కొత్త మోడల్‌ను తెచ్చిందని పార్టీ ఆరోపించింది. ఎస్‌ఐఆర్ అనంతరం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై జనవరి 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఈసీ ప్రకటించిందని, జనవరి 15 వరకు చాలా తక్కువ అభ్యంతరాలే వచ్చాయని, ఆ తర్వాత అకస్మాత్తుగా లక్షలాది ఫారం-7 అభ్యంతరాలు దాఖలయ్యాయని కాంగ్రెస్ పేర్కొంది. ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు సంతకాలతో అనేక అభ్యంతరాలు దాఖలైనప్పటికీ ఈసీ మౌన ప్రేక్షకుడిగా వ్యవహరించిందని ఆరోపించింది. ప్రధాన ప్రతిపక్షం సమాచారం కోరినా స్పందన లేదని, దీన్నిబట్టి ఎన్నికల మోసం స్పష్టమవుతోందని కాంగ్రెస్ విమర్శించింది.

ఓటు చోరీ కుట్రలో ఈసీ కీలక భాగస్వామిగా మారింది: రాహుల్ గాంధీ - Tholi Paluku