Let's talk: editor@tmv.in
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’

ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’

Thaduri Lalitya
9 నవంబర్, 2025

అక్టోబర్ 18న దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కె ర్యాంప్’ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోవాలని సిద్ధమవుతోంది. నవంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం “ఆహా” వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్, కామెడీ ఆర్టిస్టులు వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, అలీ, శ్రీనివాసరెడ్డి, ‘అమృతం’ సీరియల్ ఫేం నారిపెద్ది శివన్నారాయణలు కీలక పాత్రల్లో కనిపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం, సతీశ్ రెడ్డి మసం సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌తో చిత్రం మెరిసింది.

కథ కొనసాగిన విధానం చూస్తే.. ధనవంతుడైన యువకుడు కుమార్ (కిరణ్ అబ్బవరం) అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి (సాయి కుమార్) సలహాతో కేరళలోని కాలేజీలో చేరతాడు. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. అయితే, మెర్సీకి ఉన్న మానసిక సమస్య (పిటిఎస్‌డి) కారణంగా కథలో ట్విస్ట్‌లు, భావోద్వేగాలు మలుపు తిరుగుతాయి. కుమార్ ఆమెకు చేసిన ప్రామిస్, ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాయి. మాస్ ఎలిమెంట్స్, కామెడీ, రొమాన్స్ మిక్స్‌తో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించింది.

విడుదల తర్వాత మొదటి రోజు రూ. 4 కోట్ల గ్రాస్, రూ. 2.15 కోట్ల నెట్ కలెక్షన్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి, మొత్తం రూ. 50 కోట్ల మార్క్‌ను దాటింది. ఓవర్సీస్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, యుక్తి తరేజాతో కెమిస్ట్రీ ప్రశంసలు అందుకున్నాయి. అయితే, నరేష్ పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగ్‌లు అసభ్యంగా ఉన్నాయని కొందరు విమర్శించారు. ఇంటర్వెల్ ట్విస్ట్, ఎమోషనల్ టచ్ చిత్రాన్ని హైలైట్ చేశాయి.

కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ‘రాజావారు రాణిగారు’తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుక్రాంతి’, ‘క’ చిత్రాలతో యూత్ కనెక్ట్‌ అంశాలతో ముందుకు సాగాడు. ‘కె ర్యాంప్’తో దీపావళి విన్నర్‌గా నిలిచి, అతడి రేంజ్‌ను మరింత పెంచాడు. ఆహా సంస్థ ‘ఇయర్ యాండ్ బుర్రా పాడు ఎంటర్‌టైనర్’ అంటూ ప్రమోట్ చేస్తోంది. థియేటర్‌లో చూడలేకపోయినవారికి ఇది మంచి అవకాశం. ఓటీటీలో కూడా ఈ హిట్ కొనసాగుతుందా? అనేది వేచిచూడాలి.