Let's talk: editor@tmv.in
ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: జీహెచ్ఎంసీ కమిషనర్

ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: జీహెచ్ఎంసీ కమిషనర్

Gaddamidi Naveen
17 మార్చి, 2026

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీకి 90 శాతం రాయితీ కల్పించే వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని ఈ నెల 31 వరకు అమలు చేస్తున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ బకాయిలను చెల్లించాలని పన్ను చెల్లింపుదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తో పాటు అదనపు కమిషనర్లు ప్రియాంక అలా, రవి కిరణ్, ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్యూర్ ప్రాంతంలో మొత్తం 28.08 లక్షల ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉండగా ఇప్పటివరకు సుమారు 16.80 లక్షల మంది తమ పన్నును చెల్లించినట్లు తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.1,984 కోట్ల పన్ను వసూలు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.2,186 కోట్ల వసూళ్లు నమోదైనట్లు వెల్లడించారు. పన్ను చెల్లింపులో పారదర్శకత కోసం మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ వెబ్‌సైట్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులకు సౌకర్యం కల్పించినట్లు ఆయ‌న తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను చెల్లించని యజమానులపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్ను చెల్లింపులతో పాటు ఆస్తి అంచనా, సవరణలు వంటి సేవలు కూడా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “99 రోజుల‌ – ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి 16 వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో కార్యాలయ శుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు, నిర్మాణ వ్యర్థాల తొలగింపు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పరిశీలన, అగ్నిమాపక భద్రత తనిఖీలు, మెగా ఈ–వెస్ట్ సేకరణ డ్రైవ్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయ‌న చెప్పారు.

నగరాన్ని మరింత పరిశుభ్రంగా మార్చేందుకు పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వన్-టైమ్ సెటిల్‌మెంట్ గడువు ముగియడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 100 బస్ షెల్టర్లలో ప్రచారం, కేబుల్ ఛానెల్లు, ఎఫ్‌ఎమ్ రేడియోలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయ‌న చెప్పారు.

అదనంగా, రెండు ప్రత్యేక అవగాహన వీడియోలను థియేటర్లలో ప్రదర్శించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. ఇవి రేపటి నుంచి క్యూర్ ప్రాంతంలోని థియేటర్లలో ప్రదర్శించబడతాయని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మరింత మంది పన్ను చెల్లింపుదారులు ఓటీఎన్ పథకాన్ని వినియోగించుకునేలా ప్రచారాన్ని మరింత విస్తరించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: జీహెచ్ఎంసీ కమిషనర్ - Tholi Paluku