Let's talk: editor@tmv.in
ఓటింగ్ పారదర్శకతకు బయోమెట్రిక్ విధానం: కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఓటింగ్ పారదర్శకతకు బయోమెట్రిక్ విధానం: కేంద్రానికి సుప్రీం నోటీసులు

Panthagani Anusha
14 ఏప్రిల్, 2026

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా పటిష్టంగా మార్చే దిశగా భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ముందడుగు వేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్ (కంటిపాప) ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న విన్నపంపై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు సాంకేతికతను జోడించాలన్న ప్రతిపాదనపై తమ వివరణ ఇవ్వాలని కోరింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తక్షణమే ఈ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో జరగబోయే లోక్‌సభ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని దీనిపై విస్తృత చర్చ జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఓటర్ గుర్తింపు ప్రక్రియ కేవలం ఫోటో గుర్తింపు కార్డులు, మాన్యువల్ ధృవీకరణపైనే ఆధారపడుతోందని దీనివల్ల అనేక లొసుగులు ఉన్నాయని పేర్కొన్నారు. పాతబడిన ఫోటోలు, క్లరికల్ పొరపాట్లు రియల్-టైమ్ వెరిఫికేషన్ లేకపోవడంతో డూప్లికేట్ ఓటింగ్, ప్రాక్సీ ఓటింగ్, ఉనికిలో లేని ఓటర్లు వంటి సమస్యలు పెచ్చరిల్లుతున్నాయని వాదించారు. ముఖ్యంగా వలసలు ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్ల జాబితాలో అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా “ఒక పౌరుడు – ఒక ఓటు” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని అక్షరాలా అమలు చేయవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. ఆధార్ వ్యవస్థ ద్వారా బ్యాంకింగ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మోసాలను ఎలా అరికట్టగలిగారో అదే నమూనాను ఎన్నికల్లోనూ అమలు చేయాలని కోరారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి వ్యక్తిగత బయోమెట్రిక్ గుర్తింపును వాడటం ద్వారా ప్రతి ఓటరుకు ఒక ప్రత్యేక డిజిటల్ రికార్డు సృష్టించవచ్చని ఇది ఎన్నికలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుందని వివరించారు.

అయితే ఈ విప్లవాత్మక మార్పును అమలు చేయడంలో ఉన్న సవాళ్లను కూడా అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. బయోమెట్రిక్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలంటే భారీ ఆర్థిక వ్యయంతో పాటు దేశవ్యాప్తంగా సాంకేతిక మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. అదేవిధంగా పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యత వంటి అంశాలపై కూడా స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కేంద్రం, ఎన్నికల కమిషన్ నుంచి సమాధానాలు అందిన తర్వాతే ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగనుంది.