
ఓటింగ్‌లో బయోమెట్రిక్ వ్యవస్థ అమలు చేయండి.. సుప్రీంలో పిటిషన్
పోలింగ్ బూత్‌ల వద్ద వేలిముద్రలు, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది, సామాజిక కార్యకర్త అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఈ వ్యాజ్యం పెడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో డూప్లికేట్ ఓటింగ్, వ్యక్తి మార్పిడి (ఇంపర్సనేషన్), ‘గోస్ట్ ఓటింగ్’ వంటి అక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పిటిషన్‌లో ప్రధానంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి దిశానిర్దేశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వేలిముద్రలు, ఐరిస్ ఆధారిత గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ఒక పౌరుడు – ఒక ఓటు సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఓటర్ ఐడీ కార్డులు, మాన్యువల్ ధృవీకరణ పద్ధతులు పాత ఫోటోలు, క్లెరికల్ లోపాలు, రియల్‌టైమ్ వెరిఫికేషన్ లేకపోవడం వల్ల దుర్వినియోగానికి గురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. బయోమెట్రిక్ వ్యవస్థ ప్రత్యేకమైనది, నకిలీ చేయలేనిదిగా ఉండటంతో ఈ సమస్యలను పూర్తిగా నివారించవచ్చని వాదించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొంటూ, ఆర్టికల్ 324 ప్రకారం ఈసీఐకి ఇలాంటి సాంకేతిక మార్పులు చేయడానికి పూర్తి అధికారం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా వలస ఓటర్లు, డూప్లికేట్ ఎంట్రీలు, ‘గోస్ట్ ఓటర్లు’ వంటి సమస్యలను పరిష్కరించవచ్చని, రియల్‌టైమ్ ఆడిట్ ట్రైల్ ద్వారా పారదర్శకత, బాధ్యత పెరుగుతుందని వివరించారు. ఆధార్ ఆధారిత గుర్తింపు వ్యవస్థ ఇప్పటికే ప్రభుత్వంలోని అనేక రంగాల్లో అమల్లో ఉన్నందున, ఎన్నికల ప్రక్రియను కూడా ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ పేర్కొంది. ఈ అంశంపై 2026 మార్చి 28న ఇప్పటికే ఈసీఐకి ప్రాతినిధ్యం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని, అందుకే సుప్రీంకోర్టు జోక్యం అవసరమైందని పిటిషనర్ తెలిపారు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు జరిగేలా అవసరమైన ఇతర ఆదేశాలు కూడా ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
