Let's talk: editor@tmv.in
ఓటర్ జాబితా ప్రక్షాళనలో తెలంగాణ ఆదర్శం కావాలి: సీఈసీ

ఓటర్ జాబితా ప్రక్షాళనలో తెలంగాణ ఆదర్శం కావాలి: సీఈసీ

Gaddamidi Naveen
23 డిసెంబర్, 2025

ఓటర్ల జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకమైన జాబితాను రూపొందించడంలో తెలంగాణ రాష్ట్రం త్వరలోనే దేశవ్యాప్తంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పబోతోందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బూత్ లెవల్ ఆఫీసర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఇటీవల బీహార్‌లో విజయవంతంగా ముగిసిన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఒక బెంచ్‌మార్క్‌గా అభివర్ణించారు.

ఎన్నికల వ్యవస్థకు వెన్నెముక 'బీఎల్ఓ'లు

ఈ సంద‌ర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ..భారత ఎన్నికల వ్యవస్థకు బూత్ లెవల్ ఆఫీసర్లే వెన్నెముక అని జ్ఞానేష్ కుమార్ కొనియాడారు. వారి నిజాయితీ, కర్తవ్యనిష్ఠ, అంకితభావంపైనే ఎన్నికల జాబితాల శుద్ధి విజయవంతం అవుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భారతదేశ ఎన్నికలను గమనిస్తున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి వారికి ఉందని పేర్కొన్నారు.

బీహార్ విజయం – తెలంగాణ లక్ష్యం.

బిహార్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, అక్కడ నిర్వహించిన స‌ర్ ప్రక్రియ అత్యంత సాఫీగా సాగిందని, దాని ఫలితంగా సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్నారని ఆయ‌న‌ చెప్పారు. ఆ ఎన్నికల్లో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, రీ-పోలింగ్, రీకౌంటింగ్ అవసరం లేకుండా నిర్వహించగలిగామని ఆయ‌న‌ తెలిపారు. ఈ ఘనతకు బిహార్ బీఎల్ఓలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారు దేశవ్యాప్తంగా ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పారని అన్నారు. తెలంగాణ విషయానికి వస్తే, భౌగోళికంగా కెనడా కంటే పెద్దదైన రాష్ట్రంలా పేర్కొంటూ, ఇక్కడ ఎన్నికల జాబితాల శుద్ధి పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణలో నూతన శకం ప్రారంభమవుతుందని జ్ఞానేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే, పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల నిర్లక్ష్య ధోరణి ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. దీనికి భిన్నంగా, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఎప్పుడూ ముందుండి, పొడవైన క్యూలలో నిలబడి మరీ ఓటు హక్కును వినియోగిస్తున్నారని ఆయ‌న‌ ప్రశంసించారు. భారతదేశంలో ఎన్నికలు రాజ్యాంగం, చట్టాల ప్రకారమే జరుగుతాయని, ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రతి ఒక్కరూ చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఈసీ మరోసారి గుర్తుచేశారు.

అంతర్జాతీయ గుర్తింపు

ఇటీవల భారతదేశం ఇంటర్నేషనల్ ఐడియా సంస్థకు అధ్యక్షత వహించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 1995లో సభ్యత్వం పొందిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ అవకాశం రావడం, భారత ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, నవీనమైన సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిందనే విషయానికి నిదర్శనమని ఆయ‌న‌ చెప్పారు.

భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 90 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అంతకుముందు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఓటర్ల సంఖ్య, జిల్లాల వివరాలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల మ్యాప్ వంటి గణాంకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఓటర్ జాబితా ప్రక్షాళనలో తెలంగాణ ఆదర్శం కావాలి: సీఈసీ - Tholi Paluku