Let's talk: editor@tmv.in
ఓటర్ జాబితాలో పేర్లు చేర్చండి.. యూపీలో 70 లక్షలకుపైగా దరఖాస్తులు

ఓటర్ జాబితాలో పేర్లు చేర్చండి.. యూపీలో 70 లక్షలకుపైగా దరఖాస్తులు

Pinjari Chand
8 మార్చి, 2026

ఉత్తరప్రదేశ్‌లో 2026 ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చేందుకు 70 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్‌ రిన్వా తెలిపారు. లక్నోలోని లోక్ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనవరి 6 నుంచి మార్చి 6 వరకు జరిగిన రెండు నెలల క్లెయిమ్స్-అండ్-ఆబ్జెక్షన్స్ కాలంలో మొత్తం 70,69,810 ఫారం-6 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. వీటిలో 35,72,603 మహిళలు, 34,96,911 పురుషులు దరఖాస్తు చేయగా, 296 మంది ట్రాన్స్ జెండర్(తృతీయ లింగం) ఓటర్లు ఉన్నారు. మహిళల దరఖాస్తుల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. అక్టోబర్ 27, 2025న సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 86,69,073 ఫారం-6 దరఖాస్తులు అందినట్లు ఆయన చెప్పారు. వీటిలో 43,06,364 పురుషులు, 43,62,323 మహిళలు, 386 మంది తృతీయ లింగం ఓటర్లు ఉన్నారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలంటూ ఫారం-7 ద్వారా 2,68,682 అభ్యంతరాలు జనవరి 6 నుంచి మార్చి 6 మధ్య అందినట్లు తెలిపారు. వీటిలో 1,58,027 పురుషుల పేర్లు తొలగించాలనే అభ్యర్థనలు, 1,10,645 మహిళల పేర్లు, అలాగే 10 తృతీయ లింగం ఓటర్ల పేర్లు తొలగించాలనే అభ్యర్థనలు ఉన్నాయి. అక్టోబర్ 27 నుంచి మార్చి 6 వరకు మొత్తం 3,18,140 ఫారం-7 దరఖాస్తులుఅందాయని చెప్పారు. వీటిలో 1,86,362 పురుషులు, 1,31,766 మహిళలు, 12 తృతీయ లింగం ఓటర్ల పేర్లు తొలగించాలనే అభ్యర్థనలు ఉన్నాయి.

జనవరి 6న విడుదల చేసిన ప్రాథమిక ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో మొత్తం 12.55 కోట్ల ఓటర్లుఉన్నారని తెలిపారు. వీటిలో 6.88 కోట్లు పురుషులు (54.8%), 5.67 కోట్లు మహిళలు (45%), అలాగే 4,119 తృతీయ లింగం ఓటర్లు (0.01%) ఉన్నారు. సమాచారం ధృవీకరణ అవసరమైన 3.26 కోట్ల ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు రిన్వా తెలిపారు. ఇందులో 2003 ప్రత్యేక సవరణతో అనుసంధానం కాని 1.4 కోట్లు, అలాగే పేర్లు లేదా వయస్సులో వ్యత్యాసాలు ఉన్న 2.02 కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్పారు.

మొదటి నోటీసులు జనవరి 14న జారీ చేయగా, విచారణలు జనవరి 21న ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 100 శాతం నోటీసులు రూపొందించగా, సుమారు 3.60 కోట్లు (93.8%) ఇప్పటికే అందించామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 2.80 కోట్ల కేసుల్లో విచారణ పూర్తయింది. ఇది మొత్తం కేసుల్లో 85.8 శాతం అని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5,621 కేంద్రాల్లో విచారణలు నిర్వహించడంతో పాటు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇళ్లకు వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలను ధృవీకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సుమారు 14 శాతం విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ మార్చి 27లోపు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అక్టోబర్ 27 నుంచి మార్చి 6 వరకు ఫారం-8 ద్వారా 22,55,473 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిలో 1,56,313 చిరునామా మార్పు కోసం, 20,25,611 వివరాల సవరణ కోసం, 71,536 ఈపీఐసీ కార్డు మార్పిడి కోసం, అలాగే 2,013 దివ్యాంగుల గుర్తింపు కోసం ఉన్నాయి. జనవరి 6 నుంచి మార్చి 6 వరకు జరిగిన క్లెయిమ్స్-అండ్-ఆబ్జెక్షన్స్ కాలంలో 16,33,578 ఫారం-8 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,12,877 చిరునామా మార్పు కోసం, 14,88,115 వివరాల సవరణ కోసం, 31,602 ఈపీఐసీ కార్డు మార్పిడి కోసం, అలాగే 984 దివ్యాంగుల గుర్తింపు కోసం ఉన్నాయి.

ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలంటే నోటీసు తప్పనిసరి

ప్రత్యేక సవరణ మార్గదర్శకాల ప్రకారం జనవరి 6న ప్రచురించిన ప్రాథమిక ఓటర్ల జాబితా నుంచి ఎవరైనా పేరు తొలగించాలంటే ముందుగా నోటీసు ఇవ్వడం తప్పనిసరి అని రిన్వా తెలిపారు. అలాగే సంబంధిత ఎన్నికల నమోదు అధికారి లేదా సహాయ అధికారి సరైన కారణాలతో ఆదేశాలు జారీ చేసిన తరువాత మాత్రమే పేరు తొలగించవచ్చని చెప్పారు. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఐదు సమావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 26 వరకు జరిగిన గణన దశతో పాటు క్లెయిమ్స్-అండ్-ఆబ్జెక్షన్స్ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 3,090 సమావేశాలు నిర్వహించామని చెప్పారు.

రాజకీయ పార్టీల ద్వారా నియమితులైన 5,82,877 బూత్ లెవల్ ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. వీరిలో కొందరు 40,669 ఫారం-6, 1,805 ఫారం-7 దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించి అర్హులైన పౌరులు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా అవకాశం కల్పించామని చెప్పారు.

అదే సమయంలో ఎన్నికల సంఘం జాతీయ ఫిర్యాదు సేవా పోర్టల్‌లో అక్టోబర్ 27 నుంచి మార్చి 6 వరకు 92,497 ఫిర్యాదులు అందగా, వాటిలో 91,790 (99.24%) పరిష్కరించామని తెలిపారు. ఓటర్లు తమ బూత్ లెవల్ అధికారులతో నేరుగా మాట్లాడేందుకు ఎన్నికల సంఘం పోర్టల్, మొబైల్ యాప్‌లో బుక్‌ ఏ కాల్ విత్ బీఎల్వో సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. అదనంగా రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ 1800-180-1950 హెల్ప్‌లైన్ ద్వారా, అలాగే జిల్లా స్థాయి కాల్ సెంటర్లు 1950 నంబర్ ద్వారా ప్రజల ప్రశ్నలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు రిన్వా తెలిపారు. ఈ సవరణ కాలంలో రాజకీయ పార్టీల నుంచి మొత్తం 92 ఫిర్యాదులు అందాయని, వాటిలో సమాజ్‌వాది పార్టీ నుంచి 78, బీజేపీ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 5, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 1 ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఇవన్నీ పరిష్కరించామని తెలిపారు.

ఓటర్ జాబితాలో పేర్లు చేర్చండి.. యూపీలో 70 లక్షలకుపైగా దరఖాస్తులు - Tholi Paluku